A petitioner rests under an eagle's broad wings while accusers gather at dawn

కీర్తనలు 17

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 17 పరిశోధించే న్యాయాధిపతి నుండి నిర్దోషిత్వం కోసం విజ్ఞప్తి చేస్తుంది. కాపాడిన అడుగులు, కంటిలాంటి రక్షణ, రెక్కల కింద ఆశ్రయం, తృప్తిగా మేల్కొనే నిరీక్షణ ప్రమాదం మధ్య నిర్దోషి విజ్ఞప్తిదారుడిని నిలబెడతాయి.
నిర్దోషిత్వంరక్షణప్రార్థననిరీక్షణ
1యెహోవా, న్యాయమైన నా మనవి వినండి; నా మొర ఆలకించండి. నా ప్రార్థన వినండి అది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు.
2నాకు న్యాయమైన తీర్పు మీ నుండి రావాలి; మీ కళ్లు సరియైన దాన్ని చూడాలి.
3మీరు నా హృదయాన్ని పరిశీలించినప్పటికి, రాత్రివేళ మీరు నన్ను పరిశీలించి పరీక్షించినప్పటికీ, నాలో ఏ చెడు ఉద్దేశం మీకు కనబడలేదు; నా నోరు అతిక్రమించి మాట్లాడలేదు.
4మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టి నేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను.
5నా అడుగులు మీ మార్గాల్లో నిలిచి ఉన్నాయి; నా పాదాలు తడబడలేదు.
6నా దేవా! నేను మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు; మీ చెవి నా వైపు త్రిప్పి నా ప్రార్థన ఆలకించండి.
7మారని మీ ప్రేమలోని అద్భుతాలను నాకు చూపించండి, తమ శత్రువుల నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఆశ్రయించే వారిని మీ కుడిచేతితో మీరు రక్షిస్తారు.
8నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుష్టుల నుండి, నన్ను చుట్టుముట్టి నా ప్రాణం తీయాలనుకుంటున్న శత్రువుల నుండి మీ కనుపాపలా నన్ను కాపాడండి; మీ రెక్కల నీడలో నన్ను దాచండి.
10వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి.
11వారు నన్ను పసిగట్టి నన్ను చుట్టుముట్టారు, నన్ను నేలకూల్చాలని చూస్తున్నారు.
12వేట కోసం ఆకలిగొని ఉన్న సింహంలా, చాటున పొంచి ఉన్న కొదమసింహంలా వారు ఉన్నారు.
13యెహోవా, లెండి, వారిని ఎదిరించండి, వారిని కూలద్రోయండి; మీ ఖడ్గంతో దుష్టుల నుండి నన్ను విడిపించండి.
14ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుండి యెహోవా, మీ చేతితో నన్ను రక్షించండి. మీరు దుష్టుల కొరకు దాచిన దానితో వారి కడుపులను నింపుతారు; వారి పిల్లలు దానితో సంతృప్తి చెందుతారు, మిగిలిన దానిని తమ పిల్లలకు విడిచిపెడతారు.
15నేనైతే, నీతిగలవాడనై మీ ముఖాన్ని చూస్తాను; నేను మేల్కొనినప్పుడు, మీ స్వరూపాన్ని చూస్తూ తృప్తి పొందుతాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.