
కీర్తనలు 143
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
శత్రువులు మాట్లాడేవాడిని చీకటిలోకి తరిమివేస్తుండగా తీర్పుకు బదులుగా దయ కోసం కీర్తన 143 అడుగుతుంది. గుర్తుచేసుకున్న కార్యాలు నమ్మకాన్ని మేల్కొల్పుతాయి, ఉదయపు ప్రేమ మార్గదర్శకత్వాన్ని తెస్తుంది, పునరుజ్జీవించిన ఆత్మ విశ్వసనీయ విధేయత యొక్క సమతల మార్గాన్ని నేర్చుకుంటుంది.
దయమార్గదర్శకత్వంఉదయంపునరుజ్జీవనం
1యెహోవా, నా ప్రార్థన వినండి; దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; మీ నమ్మకత్వం నీతిని బట్టి నాకు జవాబివ్వండి.
2మీ సేవకున్ని తీర్పులోనికి తీసుకురాకండి, ఎందుకంటే సజీవులెవ్వరూ మీ దృష్టిలో నీతిమంతులు కారు.
3శత్రువు నన్ను వెంటాడుతున్నాడు, అతడు నా జీవితాన్ని నలిపివేస్తాడు; ఎప్పుడో చచ్చిన వారిలా అతడు నన్ను చీకటిలో నివసించేలా చేస్తాడు.
4నా ఆత్మ నాలో సొమ్మసిల్లిపోయింది; నా హృదయం నాలో బెదిరిపోయింది.
5వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను; మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను, మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను.
6మీ వైవు నా చేతులు చాపుతున్నాను; ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. సెలా
7యెహోవా, నాకు త్వరగా జవాబివ్వండి; ఆత్మ నీరసించి పోతూ ఉంది. మీ ముఖాన్ని మరుగు చేయకండి, లేకపోతే గొయ్యిలో దిగిపోయిన వారిలా నేనుంటాను.
8నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.
9నా కాపుదల కోసం మీ దగ్గరకు పరుగెత్తుతున్నాను, యెహోవా నా శత్రువుల నుండి నన్ను రక్షించండి.
10మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి, మీరు నా దేవుడు; మీ మంచి ఆత్మ సమతల నేల మీద నన్ను నడిపించును గాక.
11యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి; మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.
12మీ మారని ప్రేమను బట్టి నా శత్రువులను మౌనం చేయండి; నేను మీ సేవకుని కాబట్టి, నా శత్రువులను నాశనం చేయండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.