
కీర్తనలు 140
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
మాటలు, ఉరులు, ప్రణాళికలు బలహీనులను ప్రమాదంలో పడేసే హింసాత్మక కుట్రదారుల నుండి రక్షణ కోసం కీర్తన 140 అడుగుతుంది. ప్రార్థన దుర్మార్గ వ్యూహాలు వెనుకకు తిరుగుతాయని, న్యాయం పేద, అవసరతలో ఉన్న ప్రజలను రక్షిస్తుందని నమ్ముతుంది.
రక్షణహింసన్యాయంపేదలు
1యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి; హింసించేవారి నుండి నన్ను కాపాడండి,
2వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు రోజు యుద్ధము రేపుతారు.
3వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా
4యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి; దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి, నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు.
5అహంకారులు చాటుగా వల ఉంచారు; వారు వల దాడులు పరచారు, నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. సెలా
6నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను. యెహోవా, దయతో మొరను ఆలకించండి.
7ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా, యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు.
8యెహోవా, దుష్టుల కోరికలను వారికి ఇవ్వకండి; వారి ప్రణాళికలు విజయవంతం కానివ్వకండి. సెలా
9నన్ను చుట్టుముట్టినవారు గర్వముతో తలలు ఎత్తుతారు; వారి పెదవుల కీడు వారిని మ్రింగివేయాలి.
10మండుతున్న నిప్పు రవ్వలు వారిపై పడాలి; వారు అగ్నిలో పడవేయబడాలి, తిరిగి లేవకుండా మట్టి గొయ్యిలో పడవేయబడాలి.
11దూషకులు భూమి మీద స్థిరపడకుందురు గాక; విపత్తులు, దౌర్జన్యపరులను వేటాడతాయి.
12యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని, అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు.
13నిశ్చయంగా నీతిమంతులు మీ నామాన్ని స్తుతిస్తారు, యథార్థవంతులు మీ సన్నిధిలో ఉంటారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.