A wealthy ruler watches burdened laborers while a widow and child wait below

కీర్తనలు 10

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 10 అన్యాయం ఎందుకు దాగి, నియంత్రించబడకుండా కనిపిస్తుందని నిజాయితీగా ప్రశ్నిస్తుంది. ఇది బలహీనుల దోపిడీని పేరు పెట్టి, తరువాత బాధ చూడబడుతుందని, అనాథ, అణచివేయబడినవారు న్యాయం పొందుతారని ధృవీకరిస్తుంది.
అణచివేతవిలాపంన్యాయంబలహీనులు
1యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు? నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు?
2దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.
3వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు; వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.
4దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు; వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.
5వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.
6“ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు” అని వారు తమలో తాము అనుకుంటారు.
7వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.
8వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు; చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు. నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి;
9గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.
10బాధితులు నలిగి కుప్పకూలిపోతారు; వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.
11“దేవుడు ఎప్పటికీ గమనించరు; ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” అని వారు తమలో తాము అనుకుంటారు.
12యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి. నిస్సహాయులను మరువకండి.
13దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు? “దేవుడు నన్ను లెక్క అడగరు” అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు?
14దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; తండ్రిలేనివారికి మీరే సహాయకులు.
15దుష్టుల చేతిని విరగ్గొట్టండి. కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.
16యెహోవా నిరంతరం రాజై ఉన్నారు; దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు.
17యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు; మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.
18తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు, అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.