
సామెతలు 12
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సరిదిద్దడాన్ని ప్రేమించేవారు జ్ఞానాన్ని పొందుతారు, మొండి మోసం కూలిపోతుంది. శ్రద్ధగల పని, జంతువుల పట్ల మానవీయ సంరక్షణ, నిజాయితీ మాట, వివేకవంతమైన నిగ్రహం జీవితాన్ని స్థాపిస్తాయి, అయితే నిర్లక్ష్య మాటలు, సోమరి కల్పనలు హాని తెస్తాయి.
నేర్చుకోగలిగే గుణంశ్రద్ధనిజాయితీ మాటకరుణ
1శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు.
2మంచివారు యెహోవా దయ పొందుతారు, చెడు ఆలోచనలు చేసేవారికి శిక్ష విధిస్తారు.
3చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు, అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు.
4మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది.
5నీతిమంతుల ఆలోచనలు న్యాయమైనవి దుష్టుల సలహాలు మోసకరమైనవి.
6దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి, యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి.
7దుష్టులు చనిపోయి కనుమరుగవుతారు, అయితే నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుంది.
8మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.
9ఏమీ కాకపోయినా ఏదో గొప్పవానిగా నటిస్తూ ఆహారం కూడా లేని వానికంటె ఏమీ కాని వాడైనా ఒక సేవకుని కలిగి ఉన్నవాడు మేలు.
10నీతిమంతులు తన పశువులను జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ దుష్టులు చేసే అత్యంత జాలిగల పనులు కౄరంగా ఉంటాయి.
11తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి బుద్ధి ఉండదు.
12దుష్టులు కీడుచేసేవారి బలమైన కోటను కోరుకుంటారు, అయితే నీతిమంతుల వేరు చిగురిస్తుంది.
13కీడుచేసేవారు వారి పాపిష్ఠి మాటచేత చిక్కుకుంటారు, నిర్దోషులు ఆపద నుండి తప్పించుకుంటారు.
14ప్రజలు తాము చెప్పే మాటల వలన మేలు పొందుతారు, ఎవరు చేసిన పనికి వారికే ప్రతిఫలం కలుగుతుంది.
15మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది, కాని జ్ఞానులు సలహాలు వింటారు.
16మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు.
17నమ్మకమైన సాక్షులు న్యాయం మాట్లాడతారు, కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు మాట్లాడతారు.
18నిర్లక్ష్యపు మాటలు ఖడ్గాల్లా గుచ్చుతాయి, కాని జ్ఞానుల నాలుకలు స్వస్థత కలిగిస్తాయి.
19నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి, అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది.
20కీడును కలిగించువారి హృదయంలో మోసము కలదు సమాధానపరచడానికి ఆలోచన చెప్పువారు సంతోషముగా ఉందురు.
21నీతిమంతులకు ఏ ఆపద రాదు దుష్టులువాని ఇల్లు కీడుతో నిండి ఉంటుంది.
22అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు.
23వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు.
24శ్రద్ధగా పని చేసేవారు అధికారులవుతారు కానీ సోమరులు బానిసలవుతారు.
25ఒకని హృదయంలో దిగులు వానిని క్రుంగిపోయేలా చేస్తుంది, దయ గల మాటలు వానిని సంతోషపెడతాయి.
26నీతిమంతులు తమ పొరుగువారికి దారి చూపుతారు, కానీ దుష్టుని ప్రవర్తన వానిని దారి తప్పిస్తుంది.
27సోమరి మనుష్యులు తాము వేటాడిన మాంసాన్ని కాల్చరు, కానీ శ్రద్ధగల వారు తమకు దొరికిన ప్రతీదానిని ఉపయోగిస్తారు.
28నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.