An ancient village contrasts diligent workers and honest scales with idle and quarrelsome neighbors

సామెతలు 10

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
మొదటి సొలొమోను సంకలనం కుటుంబ జీవితం, పని, మాట, సంపద, సమాజం అంతటా నీతిమంతుల, దుష్టుల విధానాలను పోలుస్తుంది. శ్రద్ధ, నిజాయితీ, కాపాడిన మాటలు ఆశీర్వాదం వైపు మొగ్గు చూపుతాయి, మోసం, సోమరితనం దుఃఖం, నాశనాన్ని వ్యాపింపజేస్తాయి.
నీతిమాటశ్రద్ధనిజాయితీ
1సొలొమోను యొక్క సామెతలు: జ్ఞానం కలిగిన పిల్లలు తండ్రికి ఆనందం కలిగిస్తారు, కాని మూర్ఖపు పిల్లలు తమ తల్లికి దుఃఖాన్ని కలిగిస్తారు.
2అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.
3యెహోవా నీతిమంతులను ఆకలి గొననివ్వడు, కాని దుష్టుల కోరికను ఆయన పాడుచేస్తారు.
4సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి.
5వేసవిలో పంటను కూర్చేవారు వివేకంగల పిల్లలు, అయితే కోతకాలంలో నిద్రించేవారు అవమానాన్ని తెచ్చే పిల్లలు.
6నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, కాని దుర్మార్గుల నోరు హింసను దాచిపెడుతుంది.
7నీతిమంతుల పేరు ఆశీర్వాదాలలో వాడబడుతుంది, కాని దుర్మార్గుల పేరు కుళ్ళిపోతుంది.
8జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.
9యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.
10కళ్లతో సైగ చేసేవారు దుఃఖాన్ని కలిగిస్తారు, వ్యర్థ కబుర్లు చెప్పే మూర్ఖులు నాశనమవుతారు.
11నీతిమంతుల నోరు జీవపుఊట, కాని దుష్టుల నోరు హింసను దాచిపెడుతుంది.
12పగ తగాదాలను కలుగజేస్తుంది, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది.
13వివేచన గలవారి పెదవుల మీద జ్ఞానం కనబడుతుంది, కాని తెలివిలేని వారి వీపు మీద బెత్తంతో కొట్టబడతారు.
14జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది.
15ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం, కాని దరిద్రత పేదవారి నాశనం.
16నీతిమంతుల కష్టార్జితం జీవం, కాని దుష్టుల సంపాదన పాపం, మరణం.
17క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు, కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు.
18పగను దాచిపెట్టేవారు అబద్ధికులు, ఇతరుల మీద నిందలు వేసేవారు మూర్ఖులు.
19విస్తారమైన మాటల్లో పాపానికి అంతం ఉండదు, కాని వివేకులు నాలుకను అదుపులో పెడతారు.
20నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, కాని దుష్టుల హృదయం విలువలేనిది.
21నీతిమంతుల పెదవులు అనేకులకు మేలు చేస్తాయి, కాని బుద్ధిహీనులు తెలివిలేక చస్తారు.
22యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.
23బుద్ధిహీనులు దుష్ట పన్నాగాల్లో ఆనందిస్తారు, కాని వివేకంగలవారు జ్ఞానాన్నిబట్టి ఆనందిస్తారు.
24దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది.
25సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు.
26పళ్ళకు పులిసిన ద్రాక్షరసంలా కళ్లకు పొగలా, తమను పంపినవారికి సోమరివారు అలా ఉంటారు.
27యెహోవాయందలి భయం దీర్ఘాయువును ఇస్తుంది, కాని దుష్టుల సంవత్సరాలు కుదించబడతాయి.
28నీతిమంతుల ఆశలు ఆనందాన్నిస్తాయి కాని దుష్టుల ఆశలు ఫలించవు.
29నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, కాని కీడు చేసేవారికి అది పతనము.
30నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు.
31నీతిమంతుల నోటి నుండి జ్ఞాన ఫలం వస్తుంది, అయితే వక్ర బుద్ధిగల నాలుక మూసివేయబడుతుంది.
32నీతిమంతుల నోటికి దయ పొందడం తెలుసు, కాని దుష్టుల నోటికి వక్ర మాటలే తెలుసు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.