Generations of families approaching Mary, Joseph, and the newborn Jesus near Bethlehem

మత్తయి సువార్త 1

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
మత్తయి అబ్రాహాము, దావీదు నుండి యోసేపు వరకు యేసు వంశావళిని గుర్తిస్తాడు, తరువాత పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతి కావడాన్ని వివరిస్తాడు. దూత యోసేపును ఆమెను వివాహం చేసుకుని ఆమె కుమారుడికి యేసు అని పేరు పెట్టమని నిర్దేశిస్తాడు.
వంశావళియేసు జననంయోసేపునెరవేర్పు
1ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు యేసు వంశావళి:
2అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యూదా అతని సహోదరులు.
3యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము.
4అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను, నయస్సోను కుమారుడు శల్మాను.
5శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెష్షయి.
6రాజైన దావీదు యెష్షయి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.
7సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబీయా, అబీయా కుమారుడు ఆసా.
8ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు ఉజ్జియా.
9ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా.
10హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా.
11యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.
12బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
13జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు, అబీహూదు కుమారుడు ఎల్యాకీము, ఎల్యాకీము కుమారుడు అజోరు.
14అజోరు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు ఆకీము, ఆకీము కుమారుడు ఎలీహూదు.
15ఎలీహూదు కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు మత్తాను, మత్తాను కుమారుడు యాకోబు.
16యాకోబు కుమారుడైన యోసేపు మరియకు భర్త. ఆమె యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి.
17ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు, చెరకు కొనిపోబడినప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు.
18యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది. కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది.
19అయితే ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
20అతడు ఇలా ఆలోచిస్తూ ఉండగా, కలలో ప్రభువు దూత అతనికి కనపడి, “దావీదు కుమారుడవైన యోసేపూ, మరియను నీ భార్యగా ఇంటికి తీసుకెళ్లడానికి భయపడకు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ మూలంగా గర్భం ధరించింది.
21ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తారు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి” అని చెప్పాడు.
22ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది.
23“ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు” (అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం).
24యోసేపు నిద్రలేచి ప్రభువు దూత తనకు ఆదేశించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంట్లో చేర్చుకున్నాడు.
25అయితే ఆమె కుమారునికి జన్మనిచ్చే వరకు, యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.