
యోబు 4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఎలీఫజు మొదట మాట్లాడి మృదువుగా ప్రారంభిస్తాడు, యోబు ఒకప్పుడు బలహీనులను బలపరిచాడని గుర్తుచేస్తాడు. తరువాత అతను నిర్దోషులు నశించరని తన నమ్మకాన్ని పేర్కొని, ఏ మనిషి దేవుని ముందు నీతిమంతుడు కాగలడా అని అడిగిన స్వరం గల రాత్రి దర్శనాన్ని విజ్ఞప్తి చేస్తాడు.
ఎలీఫజుప్రతిఫలంరాత్రి దర్శనంసలహా
1అందుకు తేమానీయుడైన ఎలీఫజు ఇలా అన్నాడు:
2ఎవరైనా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నీవు సహించలేవా? కాని మాట్లాడకుండా ఎవరు ఉండగలరు?
3ఎలా నీవు చాలామందికి బుద్ధి నేర్పావో, ఎలా బలహీనమైన చేతులు బలపరిచావో ఆలోచించు.
4తొట్రిల్లినవారిని నీ మాటలు ఆదుకున్నాయి; క్రుంగిన మోకాళ్లను నీవు బలపరిచావు.
5అలాంటి నీకు ఇప్పుడు కష్టం కలిగితే నీవు నిరుత్సాహపడుతున్నావు; అది నిన్ను తాకగానే నీవు భయపడుతున్నావు.
6నీ దైవభక్తి నీకు ధైర్యం కాదా? నీ నిర్దోష ప్రవర్తన నీ నిరీక్షణ కాదా?
7“ఇప్పుడు ఆలోచించు: నిర్దోషిగా ఉన్నవాడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవంతులు ఎప్పుడైనా నాశనమయ్యారా?
8నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు.
9దేవుని శ్వాసకు వారు నశిస్తారు; ఆయన ధ్వంసం చేయు కోపం ద్వారా వారు ఇక ఉండరు.
10సింహాలు గర్జిస్తాయేమో కొదమసింహాలు కేకలు వేస్తాయేమో, అయినా అలాంటి బలమైన సింహాల కోరలు విరిగిపోతాయి.
11సింహం తిండి దొరకక నశిస్తుంది, సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి.
12“నాకొక విషయం రహస్యంగా తెలిసింది, నా చెవులు దాని గుసగుసను విన్నాయి.
13ప్రజలు గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చి కలవరపెట్టే కలలలో అది తెలిసింది,
14భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి.
15ఒక ఆత్మ నా ముఖాన్ని తాకుతూ వెళ్లింది, నా శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
16అది నా దగ్గర నిలిచింది, కాని అది ఏమిటో నేను చెప్పలేను. ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది, మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది.
17‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?
18దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,
19మట్టి ఇళ్ళలో నివసిస్తూ, దుమ్ములో పునాదులు గలవారిని, చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!
20ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి, గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు.
21వారి డేరా తాడు తెంపివేయబడుతుంది, జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.