
యోబు 32
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఇతరుల కంటే చిన్నవాడు కావడంతో ఎలీహు మౌనంగా వింటూనే ఉన్నాడు. యోబు తనను తాను నిర్దోషిగా చూపుకున్నందుకు, ముగ్గురు స్నేహితులు జవాబు ఇవ్వకుండా యోబును ఖండించినందుకు అతను కోపగించుకుంటాడు, వయస్సు తనంతట తానుగా జ్ఞానాన్ని ఉత్పత్తి చేయదని చెబుతాడు. మాటలతో నిండి, అతను తనను తాను పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొత్త తోలు తిత్తులతో పోల్చుకుంటాడు.
ఎలీహుయువత, వృద్ధాప్యంకోపంమాటలు
1యోబు తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఉన్నాడని గ్రహించిన ఆ ముగ్గురూ అతనికి సమాధానం ఇవ్వడం మానేశారు.
2దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు.
3అతడు ముగ్గురు మిత్రులపై కూడా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే వారు యోబు తప్పు అని నిరూపించడం చేతకాకపోయినా, వారు అతన్ని ఖండించారు.
4వారందరు తనకన్నా పెద్దవారు కాబట్టి యోబుతో మాట్లాడాలని ఎలీహు ఎదురుచూశాడు.
5కాని ఆ ముగ్గురు స్నేహితులు ఇంకేమి మాట్లాడకపోవడంతో అతనికి చాలా కోపం వచ్చింది.
6బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు ఇలా అన్నాడు: నేను వయస్సులో చిన్నవాన్ని, మీరు పెద్దవారు; అందుకే నేను భయపడ్డాను, నేను అనుకున్నది మీతో చెప్పడానికి ధైర్యం చేయలేదు.
7ముందుగా వయస్సు మాట్లాడాలి; గడచిన సంవత్సరాలు జ్ఞానం బోధించాలని నేననుకున్నాను.
8అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ, సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది.
9కేవలం వృద్ధులే జ్ఞానులు కారు, పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు.
10కాబట్టి నేను చెప్తున్న: నేను చెప్పేది వినండి; నాకు తెలిసింది మీకు చెప్తాను.
11మాట్లాడడానికి మీరు మాటల కోసం వెదకుతున్నప్పుడు, మీ మాటల కోసం నేను వేచి ఉన్నాను; నేను మీ అభిప్రాయాలను విన్నాను,
12మీరు చెప్పేవాటిని నేను జాగ్రత్తగా విన్నాను; అయితే మీలో ఒక్కరు కూడా యోబు తప్పు అని నిరూపించలేదు; అతని వాదనలకు ఎవరూ జవాబు చెప్పలేదు.
13మాకు జ్ఞానం లభించింది; మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి.
14కాని యోబు నాతో వాదించలేదు, మీ వాదనలతో నేను అతనికి జవాబు ఇవ్వను.
15వారు ఆశ్చర్యపడి ఇక ఏమి చెప్పలేదు; వారికి మాటలు దొరకలేదు.
16వారు జవాబేమి చెప్పలేదా అలా ఉండిపోయారు, వారు మౌనంగా ఉండగా నేను ఇంకా వేచి ఉండాలా?
17నేను కూడా చెప్పాల్సింది చెప్తాను; నేను కూడా నాకు తెలిసింది చెప్తాను.
18ఎందుకంటే నా మనస్సునిండ మాటలున్నాయి, నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది.
19నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలా ఉంది, క్రొత్త తిత్తివలె అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది.
20నేను మాట్లాడి ఉపశమనం పొందాలి; నా నోరు తెరచి సమాధానం ఇస్తాను.
21నేను పక్షపాతం చూపించను, ఏ మనుష్యుని పొగడను;
22ఎలా పొగడాలో నాకు చేతకాదు. ఒకవేళ నేను అలా పొగిడితే వెంటనే నా సృష్టికర్త నన్ను చంపుతారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.