Job remembering his family and service to vulnerable people at the gate

యోబు 29

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దేవుడు తనను, తన చుట్టూ ఉన్న పిల్లలను కాపాడిన రోజులను యోబు గుర్తుచేసుకుంటాడు. అతను ద్వారం వద్ద తన స్థానం తీసుకున్నప్పుడు గౌరవించబడ్డాడు, పేదవారిని, అనాథలను రక్షించాడు, గుడ్డివారికి కళ్లుగా, పేదలకు తండ్రిగా ఉన్నాడు, దీర్ఘ స్థిరమైన జీవితం తరువాత ఇంట్లో చనిపోతానని ఆశించాడు.
జ్ఞాపకంగౌరవంన్యాయంసమాజం
1యోబు ఇంకా ఈ విధంగా మాట్లాడాడు:
2“గడచిన నెలల్లో ఉన్నట్లు, దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్లు నేను ఉంటే ఎంత బాగుండేది,
3ఆయన దీపం నా తలపై వెలిగినప్పుడు ఆయన వెలుగును బట్టి చీకటిలో నేను నడిచాను!
4నేను నా అత్యంత ఉత్పాదక సమయంలో ఉన్నాను, దేవుని సన్నిహిత స్నేహం నా ఇంటిని దీవించినప్పుడు,
5సర్వశక్తిమంతుడు ఇంకా నాతో ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు.
6నా అడుగులు మీగడలో మునిగాయి, బండ నుండి నా కోసం ఒలీవనూనె ప్రవహించేది.
7“నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు, రాజవీధిలో నా స్థానంలో కూర్చున్నప్పుడు,
8యువకులు నన్ను చూసి తప్పుకునేవారు వృద్ధులు లేచి నిలబడేవారు;
9అధికారులు మాట్లాడడం ఆపివేసి, తమ చేతులతో నోటిని కప్పుకునేవారు;
10ప్రధానులు మౌనంగా ఉండేవారు. వారి నాలుకలు వారి అంగిటికి అంటుకుపోయాయి.
11నా గురించి విన్న వారు నన్ను ప్రశంసించారు, నన్ను చూసినవారు నా గురించి చెప్పారు,
12ఎందుకంటే సహాయం కోసం మొరపెట్టిన బీదలను, తమను చూసుకోవడానికి ఎవరూ లేని తండ్రిలేనివారిని నేను రక్షించాను.
13చనిపోబోతున్నవారు నన్ను దీవించారు; విధవరాండ్ర హృదయాలు సంతోషించేలా చేశాను.
14నేను నీతిని నా దుస్తులుగా ధరించాను; న్యాయం నాకు వస్త్రం నా తలపాగా అయ్యింది.
15గ్రుడ్డివారికి నేను కళ్లలా కుంటివారికి పాదాల్లా ఉన్నాను.
16నిరుపేదలకు నేను తండ్రిగా ఉన్నాను; అపరిచితుల పక్షంగా వాదించడానికి ఒప్పుకున్నాను.
17దుష్టుల కోరలు విరగ్గొట్టాను వారి పళ్ళ నుండి బాధితులను విడిపించాను.
18“అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ‘నా ఇంట్లోనే నేను చనిపోతాను, నా రోజులు ఇసుక రేణువుల్లా ఉంటాయి.
19నా వేర్లు నీటిని తాకుతాయి, నా కొమ్మల మీద రాత్రంతా మంచు కురుస్తుంది.
20నా ఘనత ఎప్పటికీ తగ్గదు; నా చేతిలో నా విల్లు ఎప్పుడూ క్రొత్తదిగానే ఉంటుంది.’
21“ప్రజలు నేను చెప్పేది ఆశగా వినేవారు, నా సలహా కోసం మౌనంగా ఎదురు చూసేవారు.
22నేను మాట్లాడిన తర్వాత, వారికిక ఏమి మాట్లాడలేదు; నా మాటలు మృదువుగా వారి చెవులకు చేరాయి.
23వర్షం కోసం చూసినట్లు వారు నా కోసం ఎదురు చూశారు, కడవరి వర్షంలా వారు నా మాటలు త్రాగారు.
24నేను వారిని చూసి నవ్వినప్పుడు; వారు కష్టంగా దాన్ని నమ్మారు; నా ముఖకాంతి వారికి ప్రశస్తమైనది.
25వారికి నేనే పెద్దగా కూర్చుని వారి కోసం మార్గం ఏర్పరిచాను; సైన్యం మధ్యలో ఉండే రాజులా, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించేవానిగా నేనున్నాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.