
యోబు 23
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోబు దేవుడిని ఎక్కడ కనుగొనగలడో తెలిస్తే బాగుండేదని కోరుకుంటాడు, తద్వారా తన వాదనను ఆయన ముందు ఉంచి జవాబు వినగలడు, నలిగిపోవడం కాకుండా నిర్దోషిగా ప్రకటించబడతానని నమ్మకంతో. కానీ దేవుడు ముందు, వెనుక, ఎడమ, కుడి ఎక్కడా కనుగొనబడడు, తనను నియమించినవాని పట్ల భయపడుతూనే యోబు ఆ మార్గాన్ని పట్టుకున్నాడని చెబుతాడు.
దైవిక దాపరికంనిజాయితీపరీక్షఆరాటం
1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2ఈ రోజు కూడా నా ఫిర్యాదు తీవ్రంగానే ఉంది; నా మూల్గుల కంటే ఆయన హస్తం నా మీద భారంగా ఉంది.
3నేను ఆయన నివాసస్థలానికి వెళ్లగలిగేలా; ఆయన ఎక్కడ కనిపిస్తాడో నాకు తెలిస్తే బాగుండేది కదా!
4ఆయన ఎదుటే నా ఫిర్యాదేమిటో చెప్పుకుంటాను వాదోపవాదాలతో నా నోటిని నింపుకుంటాను.
5ఆయన నాకు ఏమి జవాబు ఇస్తారో తెలుసుకుంటాను, ఆయన నాకు చెప్పేవాటిని గ్రహిస్తాను.
6ఆయన తన మహాబలంతో నాతో వాదిస్తారా? లేదు, ఆయన నా మనవి వింటారు.
7అక్కడ యథార్థవంతులు ఆయన ముందు వాదించగలరు, నేను నా న్యాయాధిపతి నుండి శాశ్వతంగా విడుదల పొందుతాను.
8కాని నేను తూర్పుకు వెళ్లినా ఆయన అక్కడ లేరు; పడమరకు వెళ్లినా నేను ఆయన ఉన్నట్లు గ్రహించలేదు.
9ఆయన ఉత్తరాన పని చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లినా నేను ఆయనను చూడలేదు; ఆయన దక్షిణ వైపుకు తిరిగినప్పుడు, నేనాయనను చూడలేదు.
10కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను.
11ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి; ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను.
12ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేదు; నేను నా అనుదిన ఆహారం కంటే ఆయన నోటి మాటలకే ఎక్కువ విలువనిచ్చాను.
13కాని ఆయన మారనివాడు, ఆయనను ఎవరు మార్చగలరు? తనకిష్టమైనదే ఆయన చేస్తారు.
14నాకు వ్యతిరేకంగా తన శాసనాన్ని ఆయన కొనసాగిస్తారు, ఇలాంటి ఎన్నో ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయి.
15కాబట్టి నేను ఆయన ఎదుట భయపడుతున్నాను, వీటన్నిటిని ఆలోచించినప్పుడు నేను ఆయనకు భయపడుతున్నాను.
16దేవుడే నా హృదయం క్రుంగిపోయేలా చేశారు; సర్వశక్తిమంతుడు నన్ను భయపెట్టారు.
17చీకటి నన్ను చుట్టుముట్టినా, దట్టమైన చీకటి నా ముఖాన్ని కమ్మినా నేను నాశనమవ్వలేదు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.