Families descending from barren hills as separate paths join toward rain-lit Jerusalem

యిర్మీయా 3

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దేవుడు అవిశ్వాసి ఇశ్రాయేలును, ద్రోహపూరిత యూదాను తమ పాపాన్ని గుర్తించి తిరిగి రమ్మని పిలుస్తాడు, దయ, స్వస్థత, విశ్వసనీయ కాపరులు, సీయోనులో పునఃకలయికను వాగ్దానం చేస్తూ. అధ్యాయం మేలుపైనున్న పశ్చాత్తాపాన్ని నిజమైన ఇంటికి తిరిగి రావడాన్ని గుర్తించే నిజాయితీ దుఃఖం, ఒప్పుకోలుతో పోలుస్తుంది.
తిరిగి రావడందయఒప్పుకోలుపునరుద్ధరణ
1“ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె అతన్ని విడిచిపెట్టి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే, అతడు మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలా? దేశమంతా పూర్తిగా అపవిత్రమవదా? అయితే నీవు చాలామంది ప్రేమికులతో వేశ్యగా జీవించావు, ఇప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తావా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
2“కళ్లు పైకెత్తి ఆ బంజరు కొండలను చూడు. నీవు అత్యాచారానికి గురి కాని ప్రదేశం ఏదైనా ఉందా? ప్రేమికుల కోసం రోడ్డు ప్రక్కన ఎదురుచూస్తూ కూర్చున్నావు, ఎడారిలో అరబీయునిగా కూర్చున్నావు. నీ వ్యభిచారంతో, దుర్మార్గంతో దేశాన్ని అపవిత్రం చేశావు.
3కాబట్టి వాన జల్లులు ఆగిపోయాయి, వసంత వర్షాలు కురవలేదు. అయినా నీవు వేశ్యలా సిగ్గుపడడానికి తిరస్కరిస్తున్నావు; నీవు సిగ్గుపడడానికి నిరాకరిస్తున్నావు.
4నీవు ఇప్పుడే నన్ను పిలిచి: ‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు,
5నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా? నీ ఉగ్రత ఎప్పటికీ ఉంటుందా?’ నీవు ఇలా మాట్లాడతావు, కానీ నీవు చేయగలిగిన కీడంతా చేస్తావు.”
6యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, “నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది.
7ఇదంతా చేసిన తర్వాత ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఆమె అలా చేయలేదు, ఆమె నమ్మకద్రోహియైన సోదరి యూదా దానిని చూసింది.
8నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది.
9ఇశ్రాయేలు అనైతికత ఆమె దృష్టికి చాలా తక్కువ కాబట్టి, ఆమె దేశాన్ని అపవిత్రం చేసింది, రాయితో, కలపతో వ్యభిచారం చేసింది.
10ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
11యెహోవా నాతో ఇలా అన్నారు: “ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు.
12నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి: “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నిత్యం కోపంగా ఉండను.
13నీ అపరాధాన్ని ఒప్పుకో నీ దేవుడైన యెహోవా మీద నీవు తిరుగుబాటు చేశావు, నీవు ప్రతి మహా వృక్షం క్రింద పరదేశి దేవుళ్ళకు నీ ఇష్టాన్ని పంచుకున్నావు, నాకు విధేయత చూపలేదు’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
14“విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను.
15అప్పుడు నేను నీకు నా హృదయానికి చాలా దగ్గరి వారైన కాపరులను ఇస్తాను, వారు జ్ఞానంతో, అవగాహనతో మిమ్మల్ని నడిపిస్తారు.
16ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు.
17ఆ సమయంలో వారు యెరూషలేమును యెహోవా యొక్క సింహాసనం అని పిలుస్తారు, యెహోవా నామాన్ని గౌరవించడానికి అన్ని దేశాలు యెరూషలేములో సమకూడుతాయి. ఇకపై వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించరు.
18ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.
19“నేను నేనే ఇలా అన్నాను, “ ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను మీకు ఆహ్లాదకరమైన భూమిని, ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’ ‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను.
20కానీ తన భర్తకు ద్రోహం చేసిన స్త్రీలా ఇశ్రాయేలూ, నీవు నాకు నమ్మకద్రోహం చేశావు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
21ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి, బంజరు కొండలమీద ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి.
22“విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి. మీ విశ్వాసభ్రష్టత్వాన్ని నేను నయం చేస్తాను.” “అవును, మేము మీ దగ్గరకు వస్తాము, ఎందుకంటే మీరే మా దేవుడైన యెహోవా.
23నిశ్చయంగా కొండలు, పర్వతాలమీద జరుగుతున్న విగ్రహారాధన అల్లకల్లోలం మోసమే; ఖచ్చితంగా మన దేవుడైన యెహోవాలో ఇశ్రాయేలు రక్షణ.
24మన పూర్వికుల శ్రమ ఫలాలను వారి గొర్రెలను, మందలను, వారి కుమారులు, కుమార్తెలను మా యవ్వనం నుండి సిగ్గుమాలిన దేవతలు తినివేశాయి.
25మనం అవమానంలో పడి ఉందాం, మన అవమానాన్ని మనల్ని కప్పివేయనిద్దాము. మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మనం పాపం చేశాము, మనమూ, మన పూర్వికులు; మా యవ్వనం నుండి నేటి వరకు మనం మన దేవుడైన యెహోవా మాటకు లోబడలేదు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.