Jeremiah holding an almond branch as a great boiling pot tips from storm clouds toward distant Jerusalem

యిర్మీయా 1

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
తన యవ్వనం, అసమర్థత భావన ఉన్నప్పటికీ దేవుడు యిర్మీయాను జాతులకు ప్రవక్తగా నియమిస్తాడు. బాదం కొమ్మ, మరుగుతున్న కుండ దర్శనాలు ఉత్తరం నుండి తీర్పు దగ్గరవుతుందని ధృవీకరిస్తాయి, దేవుడు అతనిని బలపరచి, రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు.
పిలుపుధైర్యంప్రవచనంతీర్పు
1బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణంలో ఉన్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా మాటలు.
2ఆమోను కుమారుడు యూదా రాజైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరంలో యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చి,
3యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము పాలన నుండి, యోషీయా కుమారుడును యూదా రాజునైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం పూర్తయ్యే వరకు అంటే ఆ సంవత్సరం అయిదవ నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్లేవరకు యిర్మీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది.
4యెహోవా వాక్కు నాకు వచ్చి,
5“గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.
6అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను.
7అయితే యెహోవా నాతో, “ ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి.
8నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.”
9తర్వాత యెహోవా తన చేయి చాపి, నా నోటిని ముట్టి, “నీ నోటిలో నా మాటలు పెట్టాను.
10పెళ్లగించడానికి, కూల్చివేయడానికి, నాశనం చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి నాటడానికి నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమిస్తున్నాను” అని నాతో చెప్పారు.
11తర్వాత యెహోవా నాతో మాట్లాడుతూ, “యిర్మీయా, నీకేం కనబడుతోంది?” అని అడిగారు. అందుకు నేను, “బాదం చెట్టు కొమ్మ కనబడుతోంది” అని జవాబిచ్చాను.
12యెహోవా నాతో, “నీవు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాట నెరవేరడం చూడాలని నేను కనిపెట్టుకుని ఉన్నాను” అన్నారు.
13మరోసారి యెహోవా నాతో మాట్లాడుతూ, “నీవు ఏం చూస్తున్నావు?” అని అడిగారు. అందుకు నేను, “మసలుతున్న బాన, అది ఉత్తర దిక్కునుండి మన వైపు వంగి ఉంది” అని చెప్పాను.
14అప్పుడు యెహోవా నాతో, “ఉత్తరం నుండి దేశంలో నివసించే వారందరి మీద విపత్తు కుమ్మరించబడుతుంది.
15నేను ఉత్తర రాజ్యాల జనాంగాలన్నిటిని పిలిపించబోతున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారి రాజులు వచ్చి తమ సింహాసనాలను యెరూషలేము గుమ్మాల్లో ఏర్పరచుకుంటారు; వారు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాకారాలన్నింటి మీద అలాగే యూదా పట్టణాలన్నింటి మీద దాడి చేస్తారు.
16నా ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, వారి చేతులు చేసిన విగ్రహాలను వారు పూజించి, వారు చేసిన దుర్మార్గాన్ని బట్టి నేను నా ప్రజల మీద నా తీర్పులను ప్రకటిస్తాను.
17“నిన్ను నీవు సిద్ధం చేసుకో! లేచి నిలబడి నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తే అది వారితో చెప్పు. వారికి భయపడవద్దు, లేకపోతే వారి ముందు నేను నిన్ను భయపెడతాను.
18ఈ రోజు నేను మిమ్మల్ని దేశమంతటికి వ్యతిరేకంగా యూదా రాజులకు, దాని అధికారులకు, యాజకులకు, కోటగోడలు గల పట్టణంగా, ఇనుప స్తంభంగా ఇత్తడి గోడగా చేశాను.
19వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.