Craftsmen straining to move a plain wooden idol while Jeremiah watches beneath stars and gathering storm clouds

యిర్మీయా 10

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యిర్మీయా మానవ చేతులతో రూపొందించి మోయబడే ప్రాణం లేని విగ్రహాలను భూమిని సృష్టించి సృష్టిని పరిపాలించే జీవించే దేవుడితో పోలుస్తాడు. దండయాత్ర దగ్గరవుతుండగా, ప్రవక్త స్థానభ్రంశాన్ని విలపించి, సరిదిద్దడాన్ని అంగీకరించి, యాకోబును మింగే జాతులపై దైవిక కోపం పడాలని అడుగుతాడు.
విగ్రహారాధనసృష్టికర్తసర్వాధికారంప్రవాసం
1ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి.
2యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దు ఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా, మీరు భయపడవద్దు.
3ఎందుకంటే జనాంగాల ఆచారాలు విలువలేనివి; వారు అడవిలో చెట్టు నరికి తెస్తారు, హస్తకళాకారుడు ఉలితో చెక్కుతాడు.
4వారు వెండి బంగారాలతో వాటిని అలంకరిస్తారు; కదలకుండా ఉండేలా, సుత్తితో మేకులు కొట్టి దానిని బిగిస్తారు.
5దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”
6యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; మీరు గొప్పవారు, మీ నామం ఘనమైనది.
7దేశాలకు మీరు రాజు, మిమ్మల్ని గౌరవించని వాడెవడు? గౌరవం మీకు చెందినదే. దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో వారి రాజ్యాలన్నిటిలో, మీలాంటి వారెవ్వరూ లేరు.
8వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.
9తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండి ఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి. హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసిన వాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు, అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి.
10అయితే యెహోవాయే నిజమైన దేవుడు; ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.
11“వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”
12అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.
13ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.
14మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.
15అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.
16యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.
17ఆక్రమణలో ఉంటున్నవారలారా, దేశాన్ని విడిచి వెళ్లడానికి మీ వస్తువులను సర్దుకోండి.
18ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: “ఈ సమయంలో నేను ఈ దేశంలో నివసించేవారిని తరిమివేస్తాను. వారు పట్టబడేలా నేను వారి మీదికి కష్టం రప్పిస్తాను.”
19నా గాయం వల్ల నాకు శ్రమ! నా గాయం మానిపోయేది కాదు! అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి” అని నాలో నేను చెప్పుకున్నాను.
20నా గుడారం నాశనమైంది; దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు; నా గుడారం వేయడానికి నాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు.
21కాపరులు తెలివిలేనివారు వారు యెహోవా దగ్గర విచారణ చేయరు; కాబట్టి వారు వర్ధిల్లరు వారి మంద అంతా చెదరిపోయింది.
22వినండి! నివేదిక వస్తుంది ఉత్తర దేశం నుండి ఒక గొప్ప కలకలం! అది యూదా పట్టణాలను నిర్జనంగా, నక్కల విహారంగా చేస్తుంది.
23యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు; తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు.
24యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమే మీ కోపంలో కాదు, లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు.
25మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.