
యెషయా 11
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యెష్షయి కొమ్మ నుండి చిగురు లేస్తుంది, దేవుని ఆత్మతో నిండి పేదల కోసం నీతితో తీర్పు తీరుస్తుంది. అతని శాంతియుత పాలన కింద, వేటాడేవి, వేటాడబడేవి కలిసి నివసిస్తాయి, చెల్లాచెదురైన శేషం అనేక దేశాల నుండి సమకూడుతుంది.
మెస్సయ్యనీతిశాంతిపునరుద్ధరణ
1యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది; అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది.
2యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ, ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ, తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ, అతని మీద ఉంటుంది.
3యెహోవాయందలి భయంతో అతడు సంతోషిస్తాడు. అతడు తన కళ్లతో చూసిన దానిని బట్టి తీర్పు తీర్చడు, తన చెవులతో విన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోడు;
4కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు.
5నీతి అతని నడికట్టుగా ఉంటుంది నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది.
6తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది, చిరుతపులి మేకతో పడుకుంటుంది, దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి; చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు.
7ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది.
8పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది. విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది.
9నా పరిశుద్ధ పర్వతమంతటా అవి హాని చేయవు, నాశనం చేయవు. నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.
10ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది.
11ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను , హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.
12దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు.
13ఎఫ్రాయిముకున్న అసూయ పోతుంది, యూదా శత్రువులు నశిస్తారు. ఎఫ్రాయిం యూదాపై అసూయపడదు, యూదా ఎఫ్రాయింతో విరోధంగా ఉండదు.
14వారు పడమటి వైపు ఫిలిష్తీయ వాలుల మీద దూకుతారు; వారు కలిసి తూర్పు ప్రజలను దోచుకుంటారు. వారు ఎదోమును, మోయాబును లోబరచుకుంటారు, అమ్మోనీయులు వారికి లోబడతారు.
15యెహోవా ఈజిప్టు సముద్రపు అగాధాన్ని నాశనం చేస్తారు; తన వేడి గాలితో యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు.
16ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన రోజున వారికి దారి ఏర్పడినట్లు అష్షూరు నుండి వచ్చే ఆయన ప్రజల్లో మిగిలిన వారికి రాజమార్గం ఉంటుంది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.