
హబక్కూకు 1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యూదాలో హింస, అన్యాయం, చట్టరాహిత్యం గురించి హబక్కూకు మొరపెట్టుకుంటాడు. వేగవంతమైన కల్దీయులు జయించడానికి లేపబడుతున్నారని దేవుడు జవాబిస్తాడు, లోతైన ప్రశ్నను సృష్టిస్తూ: పవిత్ర దేవుడు మరింత దుష్ట జాతిని ఎలా ఉపయోగించగలడు? ప్రవక్త వలలో చేపల్లా ప్రజలతో వారి క్రూర వ్యవహారానికి నిరసన తెలుపుతాడు.
అన్యాయంవిలాపంబబులోనుదైవిక సర్వాధికారం
1ఇది ప్రవక్తయైన హబక్కూకు ఒక దర్శనంలో పొందుకున్న ప్రవచనము.
2యెహోవా, సహాయం కోసం నేను మొరపెట్టినా, ఎంతకాలం వినకుండా ఉంటావు? “హింస!” జరుగుతుందని నీకు మొరపెట్టినా ఎంతకాలం రక్షించకుండ ఉంటావు?
3నన్నెందుకు దుష్టత్వాన్ని చూసేలా చేస్తున్నావు? తప్పు చేయడాన్ని నీవెందుకు సహిస్తున్నావు? నాశనం హింస నా ముందే ఉన్నాయి; కలహాలు ఘర్షణలు చెలరేగుతున్నాయి.
4అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది, ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు, న్యాయం చెడిపోతుంది.
5“దేశాల వైపు గమనించి చూసి, నిర్ఘాంతపోయి ఆశ్చర్యపడండి: ఎందుకంటే మీ కాలంలో నేనొక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి ఎవరైనా మీకు చెప్పినా మీరు దాన్ని నమ్మరు.
6తమవి కాని నివాస స్థలాలను ఆక్రమించుకోడానికి, భూమి అంచుల వరకు తిరిగే క్రూరులును, ఆవేశపరులునైన బబులోను ప్రజలను నేను రేపుతున్నాను.
7వారు అత్యంత భయంకరమైన ప్రజలు; వారు తమకు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేసుకుని అధికారం చెలాయిస్తారు.
8వారి గుర్రాలు చిరుతపులి కంటే వేగవంతమైనవి, చీకట్లలో తిరిగే తోడేళ్ళ కంటే భయంకరమైనవి. వారి గుర్రాల దండు దూకుడుగా చొరబడతాయి; వారి రౌతులు దూరం నుండి వస్తారు. ఎరను పట్టుకోవడానికి గ్రద్ద వచ్చినట్లుగా వారు వేగంగా వస్తారు;
9వారంతా దౌర్జన్యం చేయడానికి వస్తారు. ఎడారి గాలిలా వారి ముఖాలను పైకెత్తి ఇసుకరేణువులంత విస్తారంగా ప్రజలను బందీలుగా పట్టుకుంటారు.
10వారు రాజులను వెక్కిరిస్తారు పాలకులను ఎగతాళి చేస్తారు. కోటలున్న పట్టణాలను చూసి నవ్వుతారు; మట్టి దిబ్బలు వేసి వాటిని స్వాధీనపరచుకుంటారు.
11గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతూ అపరాధులవుతారు, తమ బలాన్నే తమ దేవునిగా భావిస్తారు.”
12యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా? నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు. యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు; నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు.
13నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి; నీవు తప్పును సహించలేవు. మరి ద్రోహులను ఎందుకు సహిస్తున్నావు? దుర్మార్గులు తమకంటే నీతిమంతులైన వారిని నాశనం చేస్తుంటే నీవెందుకు మౌనంగా ఉన్నావు?
14పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు.
15చెడ్డ శత్రువు వారందరిని గాలంతో పైకి లాగి, తన వలలో వారిని పట్టుకుంటాడు, తన ఉచ్చులో వారిని పోగుచేసుకుని సంతోషంతో గంతులు వేస్తాడు.
16తన వల వలన విలాసవంతమైన జీవితం మంచి ఆహారం దొరుకుతుందని తన వలకు బలులు అర్పించి తన ఉచ్చుకు ధూపం వేస్తాడు.
17అతడు కనికరం లేకుండా దేశాలను నాశనం చేస్తూ, నిత్యం తన వలను ఖాళీ చేస్తూనే ఉంటాడా?
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.