Prophets encouraging Zerubbabel, Jeshua, and laborers as temple construction resumes

ఎజ్రా 5

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
హగ్గయి, జెకర్యా తిరిగి వచ్చిన సమాజంతో మాట్లాడి, జెరుబ్బాబెలు, యేషువాను ఆలయ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించమని ప్రేరేపిస్తారు. పారసీక అధికారులు దర్యాప్తు చేస్తారు, కానీ పెద్దలు తమ విజ్ఞప్తిని దర్యావేషుకు పంపుతూ నిర్మించడం కొనసాగిస్తారు.
ప్రవచనంప్రోత్సాహంనిర్మాణంధైర్యం
1ప్రవక్తయైన హగ్గయి ఇద్దోకు వారసుడు, ప్రవక్తయైన జెకర్యా యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రవచించారు.
2అప్పుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ, యెరూషలేములో దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టించడం మొదలుపెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి మద్ధతు ఇచ్చారు.
3ఆ సమయంలో యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు వారి దగ్గరకు వెళ్లి, “ఈ మందిరాన్ని మరలా కట్టి దానిని పూర్తి చేయడానికి మీకు ఎవరు అనుమతిచ్చారు?” అని వారిని ప్రశ్నించారు.
4అంతే కాకుండా, “ఈ భవనాన్ని కడుతున్న వారి పేర్లు ఏమిటి?” అని కూడా అడిగారు.
5అయితే వారి దేవుని దృష్టి యూదుల పెద్దలను కాపాడుతూ ఉంది కాబట్టి ఈ సమాచారం దర్యావేషుకు చేరి అతని దగ్గర నుండి వ్రాతపూర్వక జవాబు వచ్చేవరకు వారు పని చేయడం ఆపలేదు.
6యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు రాజైన దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ఇది.
7వారు పంపిన సమాచారం ఇలా ఉంది: రాజైన దర్యావేషుకు: హృదయపూర్వక శుభాలు.
8రాజు తెలుసుకోవలసింది ఏంటంటే, మేము యూదా జిల్లాకు అక్కడ ఉన్న గొప్ప దేవుని ఆలయానికి వెళ్లాము. ప్రజలు దానిని పెద్ద రాళ్లతో కడుతున్నారు, గోడలకు దూలాలు అమరుస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పనులు శ్రద్ధతో, శరవేగంగా జరుగుతున్నాయి.
9మేము అక్కడి పెద్దలను, “ఈ మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానిని పూర్తి చేయడానికి మీకు అనుమతి ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించాము.
10అంతే కాకుండా వారి నాయకుల పేర్లు వివరాలు మీకు అందించడానికి వారి పేర్లను కూడా అడిగి తెలుసుకున్నాము.
11వారు మాకిచ్చిన జవాబు ఇది: “మేము భూమ్యాకాశాల దేవుని సేవకులము. చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాము.
12మా పూర్వికులు పరలోక దేవునికి కోపం తెప్పించారు కాబట్టి ఆయన వారిని బబులోను రాజు, కల్దీయుడైన నెబుకద్నెజరు చేతికి అప్పగించారు, అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బందీలుగా బబులోను తీసుకెళ్లాడు.
13“అయినా, బబులోను రాజైన కోరెషు హయాములో మొదటి సంవత్సరంలో రాజైన కోరెషు ఈ దేవుని మందిరాన్ని మరలా కట్టడానికి శాసనం జారీ చేశాడు.
14అంతేకాదు గతంలో నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోను క్షేత్రానికి తీసుకెళ్లిన దేవుని మందిరపు వెండి బంగారు వస్తువులను రాజైన కోరెషు బబులోను క్షేత్రంలో నుండి తెప్పించి, తాను అధిపతిగా నియమించిన షేష్బజ్జరుకు వాటిని ఇచ్చి,
15అతనితో అన్నాడు, ‘నీవు ఈ వస్తువులను తీసుకెళ్లి యెరూషలేములోని మందిరంలో ఉంచాలి. ఆ స్థలంలో దేవుని మందిరాన్ని తిరిగి కట్టించాలి.’
16“కాబట్టి ఈ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో దేవుని ఆలయానికి పునాది వేశాడు. అప్పటినుండి నేటివరకు దాన్ని కడుతున్నాము కాని అది ఇంకా పూర్తి కాలేదు.”
17ఇది రాజుకు ఇష్టమైతే, యెరూషలేములో దేవుని మందిరాన్ని నిర్మించడానికి రాజైన కోరెషు ఆదేశం ఇచ్చాడో లేదో తెలుసుకోవడానికి బబులోను రాజ్య దస్తావేజులను పరిశోధించండి. అప్పుడు ఈ విషయంలో రాజు నిర్ణయాన్ని మాకు తెలియచేయాలని కోరుతున్నాము.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.