King Cyrus commissioning Judean returnees as temple vessels are counted for Jerusalem

ఎజ్రా 1

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
పారసీక రాజు కోరేషు ప్రవాసులను తిరిగి రావడానికి, యెరూషలేము ఆలయాన్ని పునర్నిర్మించడానికి అనుమతిస్తాడు. కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వస్తాయి, పొరుగువారు వనరులను అందిస్తారు, షేష్బజ్జరు బబులోను ఒకప్పుడు ఆలయం నుండి తీసుకున్న పవిత్ర పాత్రలను అందుకుంటాడు.
తిరిగి రావడంపునరుద్ధరణఏర్పాటుఆలయం
1పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:
2“పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు.
3మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా యూదాలోని యెరూషలేముకు వెళ్లి మందిరాన్ని నిర్మించవచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, యెరూషలేములో ఉన్న దేవుడైన వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక.
4మిగిలి ఉన్నవారు ఇప్పుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం ప్రజలు వారికి వెండి, బంగారాలను, సామాగ్రిని, పశువులను యెరూషలేములోని దేవుని ఆలయానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి.’ ”
5అప్పుడు యూదా, బెన్యామీనీయుల కుటుంబ పెద్దలు, యాజకులు, లేవీయులు, దేవునిచే ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టేందుకు వెళ్లడానికి సిద్ధపడ్డారు.
6వారి పొరుగువారందరు తమ స్వేచ్ఛార్పణలతో పాటు వెండి, బంగారం, సామాగ్రి, పశువులు, విలువైన కానుకలు ఇచ్చి వారికి సహాయం చేశారు.
7అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకెళ్లి తన దేవుని గుడిలో ఉంచిన యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులను రాజైన కోరెషు బయటకు తెప్పించాడు.
8పర్షియా రాజైన కోరెషు తన కోశాధికారియైన మిత్రిదాతుతో వాటిని తెప్పించి, అతడు వాటిని లెక్కించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు అప్పగించాడు.
9ఆ జాబితాలో ఉన్న వస్తువులు: బంగారు పాత్రలు 30; వెండి పాత్రలు 1,000; వెండి కడాయిలు 29;
10బంగారు గిన్నెలు 30; వెండి గిన్నెలు 410; ఇతర వస్తువులు 1,000.
11వెండి బంగారు వస్తువులు అన్ని కలిపి మొత్తం 5,400. షేష్బజ్జరు వీటన్నిటితో పాటు బబులోనులో బందీలుగా ఉండి విడిపించబడిన వారందరిని తీసుకుని యెరూషలేముకు వెళ్లాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.