
1 యోహాను పత్రిక 1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
పాఠకులు సహవాసం, పరిపూర్ణ సంతోషాన్ని పంచుకోవడానికి లేఖ జీవ వాక్కును ప్రకటిస్తుంది. దేవుడు వెలుగు కాబట్టి, నిజమైన సహవాసం దాచిన చీకటిని తిరస్కరించి, బహిరంగంగా నడచి, పాపాన్ని ఒప్పుకుని, దేవుని విశ్వసనీయ క్షమాపణ, శుద్ధిని నమ్ముతుంది.
జీవ వాక్కుసహవాసంవెలుగుఒప్పుకోలు
1ఆది నుండి ఉన్న జీవవాక్యం గురించి మేము విన్నది, మా కళ్ళతో చూసింది, మా చేతులతో తాకింది మేము ప్రకటిస్తున్నాము.
2ఆ జీవం ప్రత్యక్షమైంది; తండ్రి దగ్గర ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్యజీవాన్ని మేము చూసి, ఆ జీవాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ దాన్ని మీకు తెలియజేస్తున్నాము.
3తండ్రితో కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడా మాతో చేరేలా మేము చూసినవాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము.
4మన ఆనందం సంపూర్ణమవ్వాలని మేము దీనిని వ్రాస్తున్నాము.
5మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు.
6ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే మనం అబద్ధం చెప్పినట్లే, సత్యంలో జీవించడం లేదు.
7అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము. ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది.
8ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు.
9ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనల్ని శుద్ధి చేస్తారు.
10మనం పాపం చేయలేదని చెప్పుకుంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.