
1 దినవృత్తాంతములు 10
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
గిల్బోవ పర్వతంపై ఇశ్రాయేలు ఓడిపోతుంది, సౌలు కుమారులు పడిపోయిన తరువాత అతను మరణిస్తాడు. ఫిలిష్తీయులు వదిలేసిన పట్టణాలను ఆక్రమించి సౌలును అవమానిస్తారు, కానీ యాబేషు-గిలాదు ధైర్యవంతులు రాజ అవశేషాలను తిరిగి పొంది సమాధి చేస్తారు.
ఓటమిసౌలుఅవిశ్వాసంపరివర్తన
1ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు; వారి ఎదుట నుండి ఇశ్రాయేలీయులు పారిపోయారు, చాలామంది గిల్బోవ పర్వతం మీద చచ్చి పడిపోయారు.
2ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి అతని కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మల్కీ-షూవలను చంపేశారు.
3సౌలు చుట్టూ యుద్ధం తీవ్రమయ్యింది, బాణాలు వేసేవారు అతన్ని చూసి అతన్ని గాయపరిచారు.
4సౌలు తన ఆయుధాలు మోసేవానితో, “నీ కత్తి దూసి నన్ను పొడవు, లేకపోతే సున్నతిలేని వీరు వచ్చి నన్ను దూషిస్తారు” అని అన్నాడు. కాని ఆ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి దానికి ఒప్పుకోలేదు; కాబట్టి సౌలు తన కత్తి తీసుకుని దాని మీద పడ్డాడు.
5ఆయుధాలు మోసేవాడు సౌలు చనిపోయాడని చూసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు.
6సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని ఇంటివారందరు ఒకేసారి చనిపోయారు.
7సైన్యం పారిపోయిందని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలీయులందరు తెలుసుకున్నప్పుడు, వారు తమ పట్టణాలను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.
8మరుసటిరోజు చనిపోయినవారిని దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, వారు గిల్బోవ పర్వతం మీద పడి ఉన్న సౌలును, అతని కుమారులను చూశారు.
9వారు అతన్ని దోచుకుని అతని తలను, అతని ఆయుధాలను తీసుకెళ్లి, తమ విగ్రహాల మధ్య, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు దూతలను పంపారు.
10వారు అతని ఆయుధాలను తమ దేవుళ్ళ గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో వ్రేలాడదీశారు.
11ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు,
12వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు.
13యెహోవాకు నమ్మకద్రోహిగా ఉన్నందుకు సౌలు చనిపోయాడు; అతడు యెహోవా వాక్కును పాటించకుండా సలహా కోసం ఆత్మలతో మాట్లాడేవారి దగ్గరకు వెళ్లాడు.
14యెహోవా దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.