
రూతు 3
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నయోమి సలహాను అనుసరించి, రూతు నూర్చే కళ్లం వద్ద బోయజును సమీపించి కుటుంబ విమోచకుడిగా వ్యవహరించమని అడుగుతుంది. బోయజు ఆమె స్వభావాన్ని గౌరవించి, దగ్గరి బంధువు వాదనను పరిష్కరిస్తానని వాగ్దానం చేసి, ఆమెను ఉదార యవ కానుకతో సురక్షితంగా ఇంటికి పంపుతాడు.
ధైర్యంనిజాయితీవిమోచనవాగ్దానం
1ఒక రోజు రూతు అత్తయైన నయోమి, “నా కుమారీ, నేను నీకోసం ఒక ఇంటిని వెదకాలి, అక్కడ నీకు మంచి జరుగుతుంది.
2నీవు ఎవరి పనికత్తెలతో పని చేస్తున్నావో, ఆ బోయజు మనకు బంధువు. ఈ రాత్రి అతడు నూర్పిడి కళ్ళంలో యవలు చెరిగిస్తూ ఉంటాడు.
3నీవు స్నానం చేసి నూనె రాసుకుని మంచి బట్టలు కట్టుకుని ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లు. అతడు భోజనం చేసే వరకు నీవు అక్కడ ఉన్నావని అతనికి తెలియనీయకు.
4అతడు పడుకున్నప్పుడు అతడు పడుకున్న స్థలం గమనించు. తర్వాత లోపలికి వెళ్లి, అతని కాళ్లమీద ఉన్న బట్ట తీసి పడుకో. నీవు ఏం చేయాలో అతడు నీకు చెప్తాడు” అని చెప్పింది.
5అందుకు రూతు, “నీవు చెప్పింది నేను చేస్తాను” అని జవాబిచ్చింది.
6కాబట్టి ఆమె ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లి, తన అత్త చెప్పినదంతా చేసింది.
7బోయజు తృప్తిగా భోజనం చేసి పడుకోడానికి ధాన్యం కుప్ప దగ్గరకు వెళ్లాడు. రూతు మెల్లగా వెళ్లి, అతని కాళ్ల మీదున్న దుప్పటి తీసి పడుకుంది.
8మధ్యరాత్రి అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్ల దగ్గర పడుకుని కనిపించింది.
9“ఎవరు నీవు?” అని అతడు అడిగాడు. రూతు జవాబిస్తూ, “నేను రూతును, మీ దాసురాలిని, మీరు నన్ను విడిపించగల సమీపబంధువు కాబట్టి నా మీద మీ వస్త్రం కప్పండి” అన్నది.
10అతడు, “నా కుమారీ, యెహోవా నిన్ను దీవించును గాక. నీవు చూపించే ఈ మంచితనం ఇంతకుముందు కన్నా ఇంకా గొప్పది: ధనికులైనా పేదలైనా సరే, నీవు ఏ యువకుల వెంటపడలేదు.
11నా కుమారీ, భయపడకు. నీవు అడిగినదంతా నీకు చేస్తాను. నీవు గుణవతివని నా పట్టణంలో ఉన్న ప్రజలందరికి తెలుసు.
12నేను నిన్ను విడిపించగల సమీపబంధువును అనే సంగతి నిజమే కాని, నా కంటే సమీపబంధువు ఒకడు ఉన్నాడు.
13ఈ రాత్రి ఇక్కడ ఉండు, ప్రొద్దున అతడు నీకు బంధువుని ధర్మం జరిగిస్తే మంచిది; అతడు నిన్ను విడిపిస్తాడు. అయితే అతడు ఒప్పుకోకపోతే, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడిపిస్తాను. ఉదయం వరకు ఇక్కడ పడుకో” అని చెప్పాడు.
14కాబట్టి ఆమె ఉదయం వరకు అతని పాదాల దగ్గర పడుకుని, ఇంకా ఒకనిని ఒకరు గుర్తుపట్టేటంత వెలుగు రాకముందే లేచింది; “ఒక స్త్రీ నూర్పిడి కళ్ళం లోనికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు” అని బోయజు అన్నాడు.
15అంతేకాక, “నీవు కప్పుకున్న దుప్పటి తీసుకువచ్చి దాన్ని పట్టుకో” అని చెప్పాడు. ఆమె అలా చేసినప్పుడు, అతడు ఆరు కొలతల యవలను పోసి ఆమెపై పెట్టాడు. తర్వాత అతడు పట్టణానికి తిరిగి వెళ్లాడు.
16రూతు తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, నయోమి, “నా కుమారీ, నీవు వెళ్లిన పని ఏమైంది?” అని అడిగింది. అప్పుడు ఆమె బోయజు తన కోసం చేసినదంతా చెప్పింది.
17అంతేకాక, “ ‘నీవు వట్టి చేతులతో నీ అత్త దగ్గరకు వెళ్లకు’ అని చెప్తూ, అతడు ఈ ఆరు కోలల యవలను నాకిచ్చాడు” అని చెప్పింది.
18అపుడు నయోమి, “నా కుమారీ, ఏమి జరుగుతుందో నీవు తెలుసుకునే వరకు వేచి ఉండు. ఈ సంగతి ఈ రోజు తేలేవరకు ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకోడు” అని అన్నది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.