
ప్రకటన 12
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
సూర్యుడిని ధరించిన స్త్రీ ప్రసవిస్తుండగా గొప్ప ఎర్ర డ్రాగను ఆమె బిడ్డను మింగాలని చూస్తుంది. బిడ్డ పైకి తీసుకువెళ్లబడతాడు, మిఖాయేలు డ్రాగనును పరలోకం నుండి పడగొడతాడు, డ్రాగను ఆమె సంతానాన్ని వెంబడిస్తుండగా స్త్రీ అరణ్య రక్షణను పొందుతుంది.
స్త్రీ, బిడ్డడ్రాగనుపరలోక సంఘర్షణవిశ్వసనీయ సాక్ష్యం
1అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.
2ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది.
3అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి.
4దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది.
5ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు “ఇనుప దండాన్ని పట్టుకుని అన్ని దేశాలను పరిపాలిస్తాడు. ” ఆ శిశువు దేవుని దగ్గరకు ఆయన సింహాసనం దగ్గరకు తీసుకుపోబడ్డాడు.
6ఆ స్త్రీ 1,260 రోజుల వరకు సంరక్షింపబడేలా దేవుడు ఆమె కోసం అరణ్యంలో సిద్ధం చేసిన స్థలానికి ఆమె పారిపోయింది.
7అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాఘటసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా ఘటసర్పం దాని సైన్యం కూడా యుద్ధంలో పోరాడాయి.
8కాని వానికి తగినంత బలం లేకపోవడంతో గెలువలేక పరలోకంలో తమ స్థానాన్ని పోగొట్టుకొన్నారు.
9ఆ తర్వాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేదా అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు.
10అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, రక్షణ, అధికారం, రాజ్యం మన దేవునివి అయ్యాయి. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.
11వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాది మీద విజయం పొందారు; వారు చావడానికి వెనుకంజ వేయలేదు తమ ప్రాణాలను ప్రేమించలేదు.
12కాబట్టి ఆకాశాల్లారా, వాటిలో నివసించేవారలారా ఆనందించండి! అయితే భూమికి సముద్రానికి శ్రమ! ఎందుకంటే, అపవాది మీ దగ్గరకు దిగివచ్చాడు! తనకు కొద్ది కాలమే మిగిలి ఉందని అతనికి తెలుసు కాబట్టి అతడు తీవ్రమైన కోపంతో ఉన్నాడు” అని ప్రకటించడం నేను విన్నాను.
13తాను భూమి మీద పడద్రోయబడడాన్ని ఘటసర్పం చూసినప్పుడు, అతడు మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ స్త్రీని వెంటాడు.
14ఒక కాలం కాలాలు సగకాలం వరకు సర్పానికి అందకుండ తన ఆకలిదప్పులు తీర్చుకొనేలా అరణ్యంలో ఆమె కోసం సిద్ధపరచిన స్థలానికి ఎగిరి వెళ్లడానికి ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి.
15అప్పుడు, ఆ స్త్రీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదిలా కుమ్మరించింది.
16కాని ఆ స్త్రీకి సహాయం చేయడానికి భూమి తన నోరు తెరిచి ఆ ఘటసర్పం నోటి నుండి వచ్చిన నదిని మ్రింగివేసింది.
17అందుకు ఆ ఘటసర్పం ఆ స్త్రీపై కోపంతో మండిపడి ఆమె మిగిలిన సంతానంతో అనగా నమ్మకంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతూ యేసు క్రీస్తు కోసం సాక్షులుగా జీవిస్తున్న వారితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లింది.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.