
కీర్తనలు 77
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 77 నిద్రలేని వేదన, విడనాడిన దయ గురించి ప్రశ్నలతో ప్రారంభమవుతుంది. సందేహాన్ని అణచివేయడానికి బదులుగా, కీర్తనకారుడు నిర్గమనం, తుఫానులు, జలాలు, కనిపించని మార్గదర్శకత్వాన్ని గుర్తుచేసుకుంటాడు, ఇవి చరిత్ర ద్వారా దేవుని నిలకడైన శక్తిని వెల్లడిస్తాయి.
విలాపంజ్ఞాపకంనిర్గమనంనిరీక్షణ
1నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను.
2నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.
3దేవా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖించాను; నేను ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ సొమ్మసిల్లింది. సెలా
4మీరు నా కనురెప్పలు తెరిచి ఉంచారు నేను మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను.
5మునుపటి రోజులను గురించి, చాలా కాలంనాటి సంవత్సరాలను గురించి నేను ఆలోచించాను.
6రాత్రివేళ నేను నా పాటలు జ్ఞాపకం చేసుకున్నాను. నా హృదయం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ అడిగింది:
7“ప్రభువు నన్ను శాశ్వతంగా తృణీకరిస్తారా? ఆయన ఎప్పటికీ తన దయను చూపించరా?
8ఆయన మారని ప్రేమ శాశ్వతంగా పోయినట్లేనా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నెరవేరదా?
9దేవుడు కరుణించడం మరచిపోయారా? ఆయన తన కోపంలో కనికరాన్ని చూపకుండ ఉంటారా?” సెలా
10అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు.
11యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను; అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
12మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను, మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.”
13దేవా, మీ మార్గాలు పరిశుద్ధమైనవి. మన దేవునిలాంటి గొప్ప దేవుడెవరున్నారు?
14మీరు అద్భుతాలు చేసే దేవుడు; మీరు ప్రజలమధ్య మీ శక్తిని చూపిస్తారు.
15మీ శక్తివంతమైన చేతితో యాకోబు, యోసేపు సంతతివారైన మీ ప్రజలను విమోచించారు. సెలా
16దేవా, జలాలు మిమ్మల్ని చూశాయి, జలాలు మిమ్మల్ని చూసి త్రుళ్ళిపడ్డాయి; అగాధాలు వణికిపోయాయి.
17మేఘాలు వర్షించాయి. ఆకాశాలు ఉరుములతో ప్రతిధ్వనించాయి. మీ బాణాలు అన్నివైపులా తళుక్కుమన్నాయి.
18మీ ఉరుము సుడిగాలిలో వినిపించింది, మీ మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది; భూమి వణికి కంపించింది.
19మీ అడుగుజాడలు కనిపించనప్పటికీ, మీ మార్గం సముద్రం గుండా, శక్తివంతమైన జలాల గుండా వెళ్లింది.
20మోషే అహరోనుల ద్వార మీరు మీ ప్రజలను మందలా నడిపించారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.