
కీర్తనలు 147
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యెరూషలేము పునరుద్ధరణను విరిగిన హృదయాలను స్వస్థపరచడం, నక్షత్రాలను లెక్కించడం, వాతావరణాన్ని పరిపాలించడం, జీవులకు ఆహారం ఇవ్వడం, వినయపూర్వక నిరీక్షణలో ఆనందించడంతో కీర్తన 147 కలుపుతుంది. స్తుతి ఏకకాలంలో విశ్వవ్యాప్త, సున్నితమైన, స్థానికంగా పునరుద్ధరించే శక్తికి జవాబిస్తుంది.
పునరుద్ధరణస్వస్థతసృష్టినిరీక్షణ
1యెహోవాను స్తుతించండి, మన దేవుని స్తుతించడం ఎంత మంచిది, ఆయనను స్తుతించడం ఎంత మనోహరమైనది, తగినది!
2యెహోవా యెరూషలేమును కట్టిస్తారు; ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.
3విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు.
4ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు, సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.
5మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు; ఆయన గ్రహింపుకు పరిమితి లేదు.
6యెహోవా దీనులను ఆదరిస్తారు కాని దుష్టులను నేలమట్టం చేస్తారు.
7యెహోవాకు కృతజ్ఞత స్తుతులు పాడండి; సితారా మీటి దేవునికి స్తుతులు పాడండి.
8ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు; భూమికి వర్షమిచ్చి కొండలపై గడ్డి మొలిపిస్తారు.
9ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు.
10గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు. యోధుల కాల్బలంలో ఆనందించరు.
11ఆయనకు భయపడు వారిని బట్టి, ఆయన మారని ప్రేమ యందు నిరీక్షణ గలవారిని బట్టి యెహోవా ఆనందిస్తారు.
12యెరూషలేమా, యెహోవాను ఘనపరచు; సీయోనూ, నీ దేవుని స్తుతించు.
13ఆయన మీ గుమ్మాల గడియలు బలపరుస్తారు మీలో మీ ప్రజలను దీవిస్తారు.
14ఆయన మీ పొలిమేరల్లో సమాధానం అనుగ్రహిస్తారు మంచి గోధుమలతో పంటనిచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు.
15ఆయన భూమిని ఆజ్ఞాపిస్తారు; ఆయన శాసనం వేగంగా పరుగెత్తుకొని పోతుంది.
16ఆయన మంచును తెల్లని ఉన్నిలా పంపిస్తారు మంచు కణాలను బూడిదలా చెదరగొడతారు.
17ఆయన వడగండ్లను గులకరాళ్లలా విసిరివేస్తాడు. ఆయన పుట్టించే తీవ్రమైన చలికి ఎవరు తట్టుకోగలరు?
18ఆయన తన మాటను పంపుతారు, అవన్నీ కరిగిపోతాయి; గాలి వీచేటట్టు చేస్తారు, నీళ్లు పారతాయి.
19ఆయన యాకోబుకు తన వాక్కును, ఇశ్రాయేలుకు తన న్యాయవిధులను శాసనాలను బయలుపరచారు.
20ఏ ఇతర జాతికి కూడా ఆయన ఈ విధంగా జరిగించలేదు; ఆయన న్యాయవిధులు వారికి తెలియవు. యెహోవాను స్తుతించండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.