A royal musician plays at sunrise beside worshipers and soldiers overlooking distant fortified lands

కీర్తనలు 108

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కీర్తన 108 మేల్కొన్న స్తుతిని సంఘర్షణ మధ్య నమ్మకంతో ఏకం చేస్తుంది. స్థిరమైన హృదయం జాతుల మధ్య పాడుతుంది, చుట్టుపక్కల భూముల మీద వాగ్దానాలను గుర్తుచేసుకుంటుంది, కేవలం మానవ రక్షణను తిరస్కరించి, సైనిక బలానికి మించిన సహాయాన్ని నమ్ముతుంది.
స్తుతినమ్మకంజాతులువిజయం
1ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది; నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను.
2సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.
3యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.
4ఎందుకంటే మీ మారని ప్రేమ గొప్పది, అది ఆకాశాల కంటే ఎత్తైనది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.
5దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి; భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.
6మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.
7దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట: “విజయంతో నేను షెకెమును పంచుతాను సుక్కోతు లోయను కొలుస్తాను.
8గిలాదు నాది, మనష్షే నాది; ఎఫ్రాయిం నా శిరస్త్రాణం, యూదా నా రాజదండం.
9మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను; ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”
10కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు? ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?
11దేవా, మమ్మల్ని విసర్జించిన మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?
12శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.
13దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.