
నెహెమ్యా 6
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
వ్యతిరేకులు పదే పదే నెహెమ్యాను దూరంగా పిలుస్తారు, తప్పుడు ఆరోపణలను వ్యాప్తి చేసి భయపెట్టడాన్ని అద్దెకు తీసుకుంటారు, కానీ అతను వారి కుతంత్రాలను గుర్తించి కేంద్రీకృతంగా ఉంటాడు. యెరూషలేము గోడ యాభై రెండు రోజుల్లో పూర్తవుతుంది, చుట్టుపక్కల శత్రువులను నిర్ణయాత్మకంగా అవమానపరుస్తుంది.
కేంద్రీకరణనిజాయితీవివేచనపూర్తి
1అప్పటికి నేను గుమ్మాలకు తలుపులు నిలబెట్టక పోయినప్పటికి, ఏ బీటలు లేకుండా గోడను పునర్నిర్మించానని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము, మరికొందరు మా మిగతా శత్రువులు విన్నారు.
2సన్బల్లటు గెషెము, “రండి, మనం ఓనో సమతల మైదానంలో ఉన్న ఒక గ్రామంలో కలుసుకుందాం” అని నాకు సందేశం పంపారు. అయితే వారు నాకు హాని చేయాలని కుట్రపన్నారు;
3కాబట్టి నేను వారికి, “నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, దానిని విడిచిపెట్టి మీ దగ్గరకు ఎందుకు రావాలి? లేను రాలేను” అని చెప్పి దూతతో కబురు పంపాను.
4వారదే పనిగా నాలుగు సార్లు కబురు పంపారు. నేను ప్రతిసారి అదే జవాబు ఇచ్చాను.
5అప్పుడు అయిదవసారి సన్బల్లటు తన పనివాని చేతికి తెరిచి ఉన్న ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు.
6దానిలో ఈ విధంగా వ్రాసి ఉంది: “నీవు యూదులతో కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో గోడ కడుతున్నావని ప్రజల మధ్యలో వదంతి ఉంది. దానిని గెషెము నిరూపించాడు. అంతే కాకుండా దాని ప్రకారం నీవు వారికి రాజు కావాలని చూస్తున్నావు.
7యూదాలో రాజు ఉన్నాడని యెరూషలేములో నీ గురించి ప్రకటించడానికి నీవు ప్రవక్తలను కూడా నియమించావు. ఈ విషయాలు రాజుకు తెలుస్తాయి కాబట్టి నీవు వస్తే ఈ విషయం గురించి మనం కలిసి మాట్లాడుకోవచ్చు.”
8అప్పుడు నేను ఈ విధంగా జవాబు పంపించాను: “నీవు చెప్పినట్లుగా ఇక్కడ ఏమి జరుగలేదు; అవన్నీ మీరు ఊహించి కల్పించినవే” అని వారికి జవాబు పంపాను.
9“వారి చేతులు పని చేసి బలహీనమైపోయి ఇక వారు ఆ పని చేయలేరు” అని భావించి వారు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. అయితే నేను, “ఇప్పుడు నా చేతులను బలపరచు” అని ప్రార్థించాను.
10ఒక రోజు నేను మెహేతబేలుకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా ఇంటికి వెళ్లాను. అతడు ఇంట్లోనే ఉన్నాడు. అతడు, “రాత్రివేళ నిన్ను చంపడానికి వారు వస్తున్నారు కాబట్టి మనం దేవుని మందిరం దగ్గర కలుసుకొని గర్భాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుందాం” అని చెప్పాడు.
11కాని నేను, “నాలాంటివాడు పారిపోవాలా? లేదా నా లాంటివాడు ప్రాణాలు కాపాడుకోడానికి గర్భాలయంలోకి వెళ్లి దాక్కోవాలా? నేను వెళ్లను” అన్నాను.
12దేవుడు అతన్ని పంపించలేదని నేను గ్రహించాను. నాకు వ్యతిరేకంగా ప్రవచించడానికి టోబీయా సన్బల్లటు అతనికి లంచం ఇచ్చారు.
13నేను భయపడి అతడు చెప్పినట్లు చేసి పాపం చేస్తే వారు నన్ను నిందించి నాకు చెడ్డ పేరు తీసుకురావాలని లంచమిచ్చి అతన్ని నియమించుకున్నారు.
14నా దేవా, టోబీయా సన్బల్లటు చేసిన దానిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి; నన్ను బెదిరించడానికి ప్రయత్నించిన ఈ ప్రవక్తలను, నోవద్యా అనే ప్రవక్తిని కూడా జ్ఞాపకం చేసుకోండి.
15ఈ విధంగా ఏలూలు నెల ఇరవై అయిదవ తేదీన అనగా యాభై రెండు రోజులకు గోడ కట్టడం పూర్తయ్యింది.
16ఈ సంగతి విన్న మా శత్రువులు చుట్టుప్రక్కల దేశాలు మా దేవుని సహాయంతో పని పూర్తయ్యిందని గ్రహించి చాలా భయపడి ధైర్యం కోల్పోయారు.
17ఆ రోజుల్లో యూదా సంస్థానాధిపతులు టోబీయాకు పదే పదే ఉత్తరాలు పంపుతూ ఉండేవారు. టోబీయా కూడా వారికి జవాబులు పంపేవాడు.
18అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. అంతే కాకుండా అతని కుమారుడైన యెహోహనాను బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. కాబట్టి యూదా వారిలో చాలామంది అతనికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేశారు.
19అంతేకాక వారు నా దగ్గరకు వచ్చి అతని గురించి పొగుడుతూ నేను చెప్పేవాటన్నిటిని అతనికి చేరవేసేవారు. నన్ను బెదిరించడానికే టోబీయా ఉత్తరాలు పంపేవాడు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.