Micah watches dawn break over the sea while a shepherd gathers a flock on green hills and shadowed city officials exchange bribes behind him

మీకా 7

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
విశ్వసనీయత లేని సమాజం గురించి మీకా విలపిస్తాడు, అధికారులు కుట్ర పన్నుతారు, సన్నిహిత సంబంధాలు కూడా అసురక్షితంగా మారతాయి. అయినప్పటికీ అతను దేవుడి కోసం వేచి చూసి చీకటి వెలుగుగా మారుతుందని నమ్ముతాడు. ముగింపు ప్రార్థన కాపరి పునరుద్ధరణ కోసం అడిగి, క్షమాపణ, కరుణ, ఒడంబడిక విశ్వసనీయతను కొనియాడుతుంది.
అవినీతిజాగరూక నిరీక్షణకాపరిత్వంకరుణక్షమాపణ
1ఏంటి నా దుస్థితి! నా పరిస్థితి వేసవికాలపు పండ్లు ఏరుకునే వానిలా ద్రాక్షతోట పరిగె సేకరించేవానిలా ఉంది; తినడానికి ద్రాక్షపండ్ల గెల లేదు, నేను ఆశించే క్రొత్త అంజూరపు పండ్లు లేవు.
2నమ్మకమైనవారు దేశంలో లేకుండా పోయారు; యథార్థవంతుడు ఒక్కడూ లేడు. అందరు రక్తం చిందించడానికి పొంచి ఉన్నారు; వారు ఒకరిని ఒకరు వలలతో వేటాడతారు.
3వారి రెండు చేతులు కీడు చేస్తాయి; పాలకులు బహుమతులు కోరతారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు, గొప్పవారు తమ కోరికను తెలియజేస్తారు. వారంతా కలిసి కుట్ర చేస్తారు.
4వారిలో మంచి వారు ముళ్ళపొద వంటివారు, వారిలో అత్యంత యథార్థవంతులు ముండ్లకంచె కంటే ఘోరము. దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు, మీ కాపరులు హెచ్చరించే రోజు వచ్చింది. ఇప్పుడే మీరు కలవరపడే సమయము.
5పొరుగువారిని నమ్మకండి; స్నేహితుని మీద నమ్మకం పెట్టుకోకండి. మీ కౌగిటిలో ఉండే స్త్రీ దగ్గర కూడా మీ పెదవుల నుండి వచ్చే మాటలను కాచుకోండి.
6కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడు, తల్లి మీదికి కుమార్తె, అత్త మీదికి తన కోడలు తిరగబడతారు, సొంత ఇంటివారే వారికి శత్రువులవుతారు.
7నేనైతే యెహోవా వైపు నిరీక్షణతో చూస్తాను, నా రక్షకుడైన దేవుని కోసం వేచి ఉంటాను; నా దేవుడు నా ప్రార్ధన వింటారు.
8నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.
9నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి, ఆయన నాకు న్యాయం తీర్చేవరకు ఆయన నా పక్షాన ఉండే వరకు నేను ఆయన కోపాగ్నిని భరిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తారు, నేను ఆయన నీతిని చూస్తాను.
10అప్పుడు నా శత్రువు దాన్ని చూసి, ఇలా జరగడం చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడ?” అని నాతో అన్న ఆమె నా కళ్లు ఆమె పతనం చూస్తాయి; ఇప్పుడు కూడా ఆమె వీధిలోని బురదలా కాళ్లక్రింద త్రొక్కబడుతుంది.
11మీ గోడలు కట్టే రోజు వస్తుంది మీ సరిహద్దులు విశాలపరిచే రోజు వస్తుంది.
12ఆ రోజు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు పట్టణాల నుండి మీ దగ్గరకు వస్తారు, ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీసు వరకు, సముద్రం నుండి సముద్రం వరకు పర్వతం నుండి పర్వతం వరకు ఉన్న ప్రజలు వస్తారు.
13భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా దేశం పాడవుతుంది.
14మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి, వారు మీ వారసత్వపు మంద, వారు అడవిలో ఒంటరిగా, సారవంతమైన పచ్చికబయళ్లలో నివసిస్తున్నారు. పూర్వకాలంలో మేసినట్లు వారిని బాషాను, గిలాదులో మేస్తారు.
15“మీరు ఈజిప్టు నుండి వచ్చిన రోజుల్లో చేసినట్లు, నేను నా అద్భుతాలు వారికి చూపిస్తాను.”
16దేశాల ప్రజలు అది చూసి తమ శక్తి కోల్పోయి సిగ్గుపడతారు. వారు తమ చేతులతో నోరు మూసుకుంటారు, వారి చెవులకు చెవుడు వస్తుంది.
17పాములా, నేల మీద ప్రాకే పురుగులా, వారు ధూళిని నాకుతారు. వారు తమ గుహల్లో నుండి వణకుతూ బయటకు వస్తారు; వారు భయంతో మన దేవుడైన యెహోవా వైపు తిరుగుతారు, నిన్ను బట్టి భయపడతారు.
18మీలాంటి దేవుడెవరు? మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు, మీరు నిత్యం కోపంతో ఉండరు కాని దయ చూపడంలో ఆనందిస్తారు.
19మీరు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తారు; మీరు మా పాపాలను అణగద్రొక్కుతారు, మా అతిక్రమాలన్నిటిని సముద్రంలో లోతుల్లో పడవేస్తారు.
20మీరు పూర్వకాలంలో మా పూర్వికులకు ప్రమాణం చేసిన విధంగా యాకోబు పట్ల నమ్మకత్వాన్ని, అబ్రాహాము పట్ల మారని ప్రేమ చూపుతారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.