Micah stands in clear light between poor families and wealthy rulers exchanging bribes as grand buildings on Zion begin to crack

మీకా 3

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
న్యాయం తెలుసుకోవలసిన పాలకులను మీకా ఖండిస్తాడు, బదులుగా వారి క్రూరత్వానికి స్పష్టమైన రూపకాలను ఉపయోగించి ప్రజలను దోచుకుంటారు. ప్రవక్తలు చెల్లింపుకు అనుగుణంగా సందేశాలను రూపొందిస్తారు, న్యాయాధిపతులు, యాజకులు, ప్రవక్తలు భద్రతను చెప్పుకుంటూ లాభం కోసం సేవ చేస్తారు. సత్యం మాట్లాడే శక్తితో, మీకా సీయోను శిథిలాలుగా మారుతుందని ప్రకటిస్తాడు.
అవినీతి నాయకత్వంలంచగొండితనంతప్పుడు ప్రవచనంన్యాయం
1అప్పుడు నేను ఇలా అన్నాను, “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, వినండి. న్యాయాన్ని మీరు తెలుసుకోవద్దా?
2మీరు మంచిని అసహ్యించుకుని చెడును ప్రేమిస్తారు; నా ప్రజల చర్మం ఒలిచి, వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తారు;
3నా ప్రజల మాంసాన్ని తింటారు, వారి చర్మం ఒలిచి, వారి ఎముకలను ముక్కలుగా విరగ్గొడతారు; పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు, కుండలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు చేస్తారు.”
4తర్వాత వారు యెహోవాకు మొరపెడతారు, కాని ఆయన వారికి జవాబివ్వరు. వారు చేసిన చెడు కారణంగా ఆయన ఆ కాలంలో తన ముఖం దాచుకుంటారు.
5యెహోవా చెప్పే మాట ఇదే: “నా ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రవక్తల విషయానికి వస్తే, వారికి తినడానికి ఏదైన ఉంటే, వారు ‘సమాధానం’ ప్రకటిస్తారు, కాని ఎవరైనా వారికి భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధానికి సిద్ధపడతారు.
6కాబట్టి మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముతుంది, సోదె చెప్పకుండా మిమ్మల్ని చీకటి ఆవరిస్తుంది. ప్రవక్తలకు సూర్యాస్తమయం అవుతుంది, పగలు వారికి చీకటిగా మారుతుంది.
7అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గుపడతారు సోదె చెప్పేవారు అవమానపడతారు. దేవుని దగ్గర నుండి జవాబేమీ రాక వారంతా తమ ముఖాలను కప్పుకుంటారు.”
8నేనైతే, యాకోబుకు అతని అతిక్రమాన్ని ఇశ్రాయేలుకు అతని పాపాన్ని తెలియజేయడానికి, యెహోవా ఆత్మను పొంది శక్తితో నింపబడి ఉన్నాను, న్యాయబుద్ధితో, బలంతో ఉన్నాను.
9యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. మీరు న్యాయాన్ని తృణీకరించి, సరియైన దానినంతటిని వంకర చేస్తారు;
10మీరు రక్తపాతంతో సీయోనును కడతారు, దుష్టత్వంతో యెరూషలేమును నిర్మిస్తారు.
11దాని నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తారు, దాని యాజకులు జీతానికి ఉపదేశిస్తారు. దాని ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెప్తారు. అయినా వారు యెహోవా సహాయం కోసం చూస్తూ, “యెహోవా మన మధ్య ఉన్నారు గదా! ఏ కీడు మన మీదికి రాదు” అంటారు.
12కాబట్టి మీ కారణంగా, సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.