Deborah under her palm while Barak gathers troops and chariots falter in a distant flood

న్యాయాధిపతులు 4

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దెబోరా సీసెరా రథ సైన్యాన్ని ఎదుర్కొనమని బారాకును పిలుస్తుంది, అతను సంకోచించినప్పుడు అతనితో పాటు వెళుతుంది. దేవుడు కీషోను దగ్గర శత్రువును గందరగోళంలో పడేస్తాడు, సీసెరా యాయేలు గుడారానికి పారిపోతాడు, అక్కడ అతని శక్తి చివరికి ముగుస్తుంది.
నాయకత్వంధైర్యంవిడుదలఅనూహ్య సాధనాలు
1ఏహూదు మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు.
2కాబట్టి యెహోవా వారిని హాసోరులో పరిపాలించే కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి హరోషెత్-హగ్గోయిములో నివసించిన సీసెరా.
3అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు.
4ఆ కాలంలో లప్పీదోతు భార్యయైన దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.
5ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు.
6ఆమె నఫ్తాలిలోని కెదెషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపించి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు: ‘నీవు వెళ్లి నఫ్తాలి జెబూలూను గోత్రాల నుండి పదివేలమంది మనుష్యులను తాబోరు పర్వతం దగ్గరకు పిలిపించు.
7యాబీను సేనాధిపతియైన సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నడిపించి నీ చేతికి అతన్ని అప్పగిస్తాను.’ ”
8బారాకు ఆమెతో, “నీవు నాతో వస్తే నేను వెళ్తాను నీవు రాకపోతే వెళ్లను” అన్నాడు.
9అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది.
10బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది పురుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్లింది.
11కెనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన వారైన కెనీయులను విడిచిపెట్టి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములోని మస్తకిచెట్టు దగ్గర తన గుడారం వేసుకున్నాడు.
12అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు పర్వతం మీదికి వెళ్లాడని సీసెరాకు చెప్పినప్పుడు,
13సీసెరా హరోషెత్-హగ్గోయిము నుండి కీషోను వాగువరకు తన సైన్యమంతటిని, తన తొమ్మిది వందల ఇనుప రథాలను పిలిపించుకున్నాడు.
14అప్పుడు దెబోరా బారాకుతో, “వెళ్లు! ఈ రోజు యెహోవా నీ చేతికి సీసెరాను అప్పగించారు. యెహోవా నీకు ముందుగా వెళ్లలేదా?” అని అడిగినప్పుడు బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం నుండి దిగి వెళ్లాడు.
15బారాకు దాడి చేసినప్పుడు యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటిని, అతని సైన్యాన్ని ఖడ్గంతో హతం చేయగా సీసెరా తన రథాన్ని దిగి కాలినడకన పారిపోయాడు.
16బారాకు ఆ రథాలను, సైన్యాన్ని హరోషెత్-హగ్గోయిము వరకు వెంటాడగా సీసెరా సైన్యమంతా ఖడ్గంతో చంపబడ్డారు; ఏ ఒక్కరు మిగల్లేదు.
17హాసోరు రాజైన యాబీనుకు, కెనీయుడైన హెబెరు కుటుంబానికి మధ్య స్నేహబంధం ఉండేది కాబట్టి సీసెరా కాలినడకన కెనీయుడైన హెబెరు భార్యయైన యాయేలు గుడారానికి పారిపోయాడు.
18యాయేలు సీసెరాను కలుసుకోడానికి బయటకు వెళ్లి, “నా ప్రభువా, లోనికి రండి. భయపడకండి” అని అన్నది. కాబట్టి అతడు గుడారంలోకి వెళ్లగా ఆమె దుప్పటితో అతన్ని కప్పింది.
19“నాకు దాహంగా ఉంది, దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వు” అని అతడు అన్నాడు. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతడు త్రాగడానికి ఇచ్చి అతన్ని తిరిగి కప్పింది.
20అతడు ఆమెతో, “గుడార ద్వారం దగ్గర నిలబడు, ఎవరైనా వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.
21అయితే హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు సుత్తిని తీసుకుని, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని దగ్గరకు నెమ్మదిగా వెళ్లింది. ఆమె ఆ మేకును అతని కణతలలో నుండి నేలలోకి దిగగొట్టగా అతడు చనిపోయాడు.
22అప్పుడు బారాకు సీసెరాను తరుముతూ వెళ్తునప్పుడు యాయేలు అతన్ని ఎదుర్కొని, “రండి, మీరు వెదుకుతున్న మనిషిని నేను చూపిస్తాను” అని అన్నది. అతడు ఆమెతో లోనికి వచ్చినప్పుడు, అక్కడ సీసెరా కణతలలో మేకుతో చచ్చి పడి ఉన్నాడు.
23ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును ఓడించారు.
24ఇశ్రాయేలీయులు కనాను రాజైన యాబీనును సంపూర్ణంగా నాశనం చేసే వరకు వారి హస్తం అంతకంతకు కఠినం అయ్యింది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.