Caleb and Joshua looking toward the fortified hill country of Hebron

యెహోషువ 14

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యూదా చీటి ద్వారా భూభాగాన్ని పొందుతుంది, కాలేబు నలభై ఐదు సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానాన్ని యెహోషువకు గుర్తుచేస్తాడు. ఎనభై ఐదు సంవత్సరాలలో ఇంకా చురుకుగా ఉన్న కాలేబు తాను పూర్తిగా దేవుడిని అనుసరించినందుకు హెబ్రోను కొండ ప్రాంతాన్ని కోరతాడు, యెహోషువ అతనిని ఆశీర్వదిస్తాడు.
విశ్వసనీయతధైర్యంసహనంవారసత్వం
1ఇవి ఇశ్రాయేలీయులు కనాను దేశంలో వారసత్వంగా పొందిన ప్రాంతాలు, వీటిని యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు గోత్ర వంశ పెద్దలు వారికి కేటాయించారు.
2యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా, తొమ్మిదిన్నర గోత్రాలకు చీటి ద్వారా వారి వారసత్వాలు కేటాయించబడ్డాయి.
3మోషే యొర్దాను తూర్పున ఉన్న రెండున్నర గోత్రాలకు వారి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కానీ మిగిలిన వాటిలో లేవీయులకు వారసత్వం ఇవ్వలేదు,
4ఎందుకంటే యోసేపు సంతతివారైన మనష్షే, ఎఫ్రాయిములు రెండు గోత్రాలుగా అయ్యారు. లేవీయులకు భూమిలో వాటా లేదు, కానీ వారి మందలు, గొర్రెల మందల కోసం పచ్చికబయళ్లు, నివసించడానికి పట్టణాలు మాత్రమే పొందుకున్నారు.
5కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు దేశాన్ని విభజించారు.
6యూదా ప్రజలు గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి, కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో, “నీ గురించి, నా గురించి కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా ఏమి చెప్పారో నీకు తెలుసు.
7యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియా నుండి దేశాన్ని పరిశోధించడానికి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాలు. నా నమ్మకం ప్రకారం నేను అతనికి ఒక నివేదికను తీసుకువచ్చాను,
8కానీ నాతో వచ్చిన నా తోటి ఇశ్రాయేలీయులు ప్రజల గుండెలు భయంతో కరిగిపోయేలా చేశారు. అయితే, నేను నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించాను.
9కాబట్టి ఆ రోజున మోషే నాతో ప్రమాణం చేసి, ‘నీవు నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన దేశం నీకు, నీ పిల్లలకు శాశ్వత వారసత్వంగా ఉంటుంది’ అని చెప్పాడు.
10“యెహోవా వాగ్దానం చేసినట్లుగా, ఆయన మోషేతో ఈ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగిన ఈ నలభై అయిదు సంవత్సరాలు నన్ను బ్రతికించారు. ఇప్పుడు నాకు ఎనభై అయిదు సంవత్సరాలు!
11మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను.
12ఆ రోజు యెహోవా నాకు వాగ్దానం చేసిన ఈ కొండ సీమను ఇప్పుడు నాకు ఇవ్వండి. అనాకీయులు అక్కడ ఉన్నారని, వారి పట్టణాలు కోటగోడలతో విశాలంగా ఉన్నాయని అప్పుడు నీవే స్వయంగా విన్నావు. అయితే, యెహోవా నాకు సహాయం చేస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నేను వారిని వెళ్లగొడతాను” అని చెప్పాడు.
13అప్పుడు యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు.
14అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హృదయమంతటితో అనుసరించాడు కాబట్టి అప్పటినుండి హెబ్రోను కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబుకు వారసత్వంగా ఉంది.
15(హెబ్రోనును అనాకీయులలో గొప్ప వ్యక్తియైన అర్బా పేరున కిర్యత్-అర్బా అని పిలిచేవారు.) అప్పుడు దేశం యుద్ధాలు లేకుండా విశ్రాంతిగా ఉంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.