Jonah sits angrily beneath a withered shade plant as hot wind crosses the hillside and the crowded city of Nineveh rests below

యోనా 4

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
దేవుడు దయ, కరుణ గలవాడని తనకు తెలుసు కాబట్టి నీనెవె దయపై యోనా అసంతృప్తి చెందుతాడు. నగరానికి తూర్పున వేచి ఉంటూ, అతను నీడ మొక్కను స్వాగతిస్తాడు, తరువాత ఒక పురుగు, మండే గాలి దానిని నాశనం చేసినప్పుడు నిరాశపడతాడు. మొక్క పట్ల యోనా శ్రద్ధను నీనెవె ప్రజలు, జంతువుల పట్ల దైవిక శ్రద్ధతో దేవుడు పోలుస్తాడు.
కోపంకరుణనీడ మొక్కనీనెవె
1అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది.
2అతడు యెహోవాకు ప్రార్థన చేస్తూ అన్నాడు, “యెహోవా, ఇలా జరుగుతుందని నేను నా దేశంలో ఉన్నప్పుడే చెప్పలేదా? అందుకే నేను తర్షీషుకు పారిపోవడానికి ప్రయత్నించాను. మీరు కృపాకనికరంగల దేవుడని, త్వరగా కోప్పడరని, మారని ప్రేమ గలవారని, కీడు కలిగించకుండా మానివేస్తారని నాకు తెలుసు.
3యెహోవా, బ్రతకడం కంటే నాకు చావడం మేలు, కాబట్టి నా ప్రాణాన్ని తీసివేయండి.”
4అయితే యెహోవా జవాబిస్తూ, “నీవలా కోప్పడడం న్యాయమేనా?” అని అన్నారు.
5తర్వాత యోనా బయటకు వెళ్లి పట్టణానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ తన కోసం తాను ఒక పందిరి వేసుకొని, పట్టణానికి ఏం జరుగుతుందో చూద్దామని దాని నీడలో కూర్చుని ఉన్నాడు.
6అప్పుడు యెహోవా, యోనా తలకు నీడనివ్వాలని, అతనికి కలిగిన బాధ తగ్గించాలని ఆకులుగల ఒక చెట్టును మొలిపించారు, యోనా ఆ చెట్టును బట్టి ఎంతో సంతోషించాడు.
7అయితే మరుసటిరోజు ఉదయం దేవుడు ఒక పురుగును పంపగా అది చెట్టును తినివేయడంతో ఆ చెట్టు వాడిపోయింది.
8సూర్యుడు ఉదయించినప్పుడు, దేవుడు తూర్పు నుండి వడగాలిని పంపించారు, యోనా తలకు ఎండదెబ్బ తగిలి అతడు నీరసించిపోయాడు. “నేను బ్రతికి ఉండడం కంటే చావడం మేలు” అని తనలో తాను అనుకున్నాడు.
9అయితే దేవుడు యోనాతో, “ఆ చెట్టు గురించి నీవలా కోప్పడడం సరైనదా?” అన్నారు. అతడు, “అవును, సరైనదే, నాకు చావాలన్నంత కోపం వస్తుంది” అన్నాడు.
10అయితే యెహోవా, “నీవు ఈ చెట్టును పోషించలేదు, పెంచలేదు. అది రాత్రికి రాత్రి మొలిచింది, రాత్రికి రాత్రి చచ్చింది. అయినా నీవు ఈ చెట్టు విషయంలో బాధపడుతున్నావు.
11అలాంటప్పుడు కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేలమంది మనుష్యులు ఎన్నో జంతువులు ఉన్న గొప్ప పట్టణమైన నీనెవె గురించి నేను చింతించకూడదా?” అన్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.