Multitudes gather in a broad valley beneath a darkened sun and moon as harvest sickles and a wine vat frame radiant Zion and a clear flowing spring

యోవేలు 3

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ప్రజలను చెదరగొట్టి, దుర్బలులను దోచుకున్నందుకు జాతులను జవాబుదారీగా పిలుస్తూ దేవుడు యూదా, యెరూషలేమును పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తాడు. విశ్వ చీకటి కింద నిర్ణయ లోయలో బహుజనం సమకూడుతారు. కర్త్త ప్రజలకు ఆశ్రయంగా మారతాడు, పవిత్ర స్థలం నుండి వచ్చే ఊట శాశ్వతంగా సురక్షితమైన భూమికి నీరు పెడుతుంది.
జాతుల తీర్పుసీయోనుఆశ్రయంపునరుద్ధరణ
1“ఆ దినాల్లో ఆ కాలంలో, నేను యూదా, యెరూషలేము వారిని తిరిగి రప్పించినప్పుడు,
2నేను దేశాలన్నిటిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోకి నడిపిస్తాను. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులకు వారు చేసిన దానిని బట్టి, అక్కడ వారికి న్యాయ విచారణ జరిగిస్తాను, ఎందుకంటే వారు నా ప్రజలను దేశాల్లో చెదరగొట్టారు నా దేశాన్ని విభజించారు.
3వారు నా ప్రజల కోసం చీట్లు వేసి అబ్బాయిలను ఇచ్చి వేశ్యలను తీసుకున్నారు. అమ్మాయిలను అమ్మి ద్రాక్షరసం కొన్నారు.
4“తూరూ, సీదోనూ, ఫిలిష్తియా ప్రాంతాలందరూ, నా మీద మీకున్న వ్యతిరేకత ఏంటి? నేను చేసిన దానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేస్తే, మీరు చేసిన దాన్ని త్వరలోనే, చాలా వేగంగా మీ తల మీదికి రప్పిస్తాను.
5ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు తీసుకెళ్లారు.
6యూదా, యెరూషలేము ప్రజలు తమ ప్రాంతానికి దూరం ఉండాలని వారిని గ్రీకులకు అమ్మివేశారు.
7“చూడండి, మీరు వారిని అమ్మి వేసిన స్థలాల నుండి వారిని రప్పిస్తాను. మీరు చేసిన దాన్ని మీ తల మీదికే రప్పిస్తాను.
8నేను మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు అమ్ముతాను, వారు దూర దేశస్థులైన షెబాయీయులకు వారిని అమ్మివేస్తారు.” యెహోవా చెప్పింది ఇదే.
9దేశాల మధ్య ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి! వీరులను పురికొల్పండి, పోరాడేవారందరు సమకూడి వచ్చి దాడి చేయాలి.
10మీ నాగటి నక్కులను సాగగొట్టి ఖడ్గాలు చేయండి, మడ్డికత్తులను సాగగొట్టి ఈటెలుగా చేయండి. “నేను బలవంతున్ని!” అని బలహీనులు అనుకోవాలి.
11ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి. యెహోవా, మీ వీరులను తీసుకురండి!
12“దేశాలు లేవాలి; అవి యెహోషాపాతు లోయ వైపు వెళ్లాలి నలుదిశల ఉన్న అన్ని దేశాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.
13పంట పండింది కాబట్టి, కొడవలి తిప్పండి, ద్రాక్షగానుగ నిండింది తొట్లు పొర్లి పారుతున్నాయి కాబట్టి రండి, ద్రాక్షలను త్రొక్కండి, వారి దుష్టత్వం అధికంగా ఉంది!”
14తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు, ఎందుకంటే తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం ఆసన్నమైంది.
15సూర్యచంద్రులు చీకటిగా మారుతాయి, నక్షత్రాలు ఇక ప్రకాశించవు.
16యెహోవా సీయోను నుండి గర్జిస్తారు, యెరూషలేములో నుండి ఉరుముతారు; భూమ్యాకాశాలు వణకుతాయి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలకు దుర్గంగా ఉంటారు.
17“అప్పుడు మీ దేవుడైన యెహోవానైన నేను నా పవిత్ర కొండయైన సీయోను మీద నివసిస్తానని మీరు తెలుసుకుంటారు. యెరూషలేము పరిశుద్ధంగా ఉంటుంది; ఇక ఎన్నడు ఇతర దేశాల సైన్యాలు దానిని ఆక్రమించరు.
18“ఆ రోజు పర్వతాల నుండి క్రొత్త ద్రాక్షరసం ప్రవహిస్తుంది, కొండల నుండి పాలు ప్రవహిస్తాయి; యూదాలోని వాగులన్నిటిలో నీళ్లు పారతాయి. యెహోవా మందిరంలో నుండి ఒక ఊట ప్రవహిస్తూ, షిత్తీము లోయను తడుపుతుంది.
19అయితే ఈజిప్టు పాడైపోతుంది, ఎదోము పాడైపోయిన ఎడారిగా అవుతుంది. ఎందుకంటే ఈ దేశాలు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశాయి, వారి దేశంలో నిర్దోషుల రక్తం చిందించారు.
20యూదాలో ప్రజలు నిత్యం నివసిస్తారు, యెరూషలేము తరతరాలకు నివాస స్థలంగా ఉంటుంది.
21వారు చిందించిన నిర్దోషుల రక్తాన్ని బట్టి ప్రతీకారం తీసుకోకుండా వారిని వదిలేయాలా? నేను ప్రతీకారం చేస్తాను.” యెహోవా సీయోనులో నివసిస్తున్నారు!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.