A messenger placing a flower garland on a mourner while families rebuild walls and plant young trees

యెషయా 61

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఆత్మతో అభిషేకించబడిన దూత శుభవార్త, స్వేచ్ఛ, ఓదార్పు, దయ సంవత్సరాన్ని ప్రకటిస్తాడు. దుఃఖించేవారు బూడిదకు బదులుగా అందాన్ని పొంది, బలమైన సింధూరవృక్షాలుగా మారి, పురాతన శిథిలాలను తిరిగి కట్టి, రక్షణ వస్త్రాల్లో సంతోషిస్తారు.
శుభవార్తస్వేచ్ఛఓదార్పుపునరుద్ధరణ
1ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు. విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి బందీలకు విడుదలను ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,
2యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,
3సీయోనులో దుఃఖిస్తున్న వారికి బూడిదకు బదులుగా అందమైన కిరీటాన్ని దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, నీతి అనే సింధూర చెట్లని యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు.
4పురాతన శిథిలాలను వారు మరలా కడతారు గతంలో నాశనమైన స్థలాలను వారు పునరుద్ధరిస్తారు; పాడైపోయిన పట్టణాలను తరతరాల నుండి నాశనమైన ఉన్న స్థలాలను వారు నూతనపరుస్తారు.
5అపరిచితులు మీ మందల్ని మేపుతారు; విదేశీయులు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పని చేస్తారు.
6మీరు యెహోవా యాజకులని పిలువబడతారు, మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది. దేశాల సంపదను మీరు అనుభవిస్తారు వారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు.
7మీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు బదులుగా మీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు. మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు, శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది.
8“ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.
9వారి వారసులు దేశాల మధ్య వారి సంతానం జనాంగాల మధ్య ప్రసిద్ధి పొందుతారు. వారు యెహోవా ఆశీర్వదించిన ప్రజలని వారిని చూసినవారందరు గుర్తిస్తారు.”
10యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
11భూమి మొలకను మొలిపించినట్లు, విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా, అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవా నీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.