
యెషయా 35
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
అరణ్యం పుష్పించి, బలహీనులు ధైర్యాన్ని పొందగా, బలహీన శరీరాలు పునరుద్ధరించబడతాయి. సురక్షిత రాజమార్గం విమోచించబడినవారిని పాటలతో సీయోనుకు ఇంటికి నడిపిస్తుంది, దుఃఖం, నిట్టూర్పు శాశ్వత సంతోషానికి దారి ఇస్తాయి.
పునరుద్ధరణస్వస్థతసంతోషంతిరిగి రావడం
1ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి; అరణ్యం సంతోషించి పూస్తుంది. అది కుంకుమ పువ్వులా,
2ఒక్కసారిగా విచ్చుకుంటుంది; అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది. లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది, కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది; వారు యెహోవా మహిమను మన దేవుని వైభవాన్ని చూస్తారు.
3బలహీనమైన చేతులను బలపరచండి, వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;
4భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”
5అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి చెవిటి వారి చెవులు వినబడతాయి.
6అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు, మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి ఎడారిలో కాలువలు పారతాయి.
7మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి. ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.
8అక్కడ రహదారి ఉంటుంది; అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది; అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే. అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు; దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.
9అక్కడ ఏ సింహం ఉండదు, ఏ క్రూర జంతువు ఉండదు; అవి అక్కడ కనబడవు. విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.
10యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.