
హోషేయ 5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యాజకులు, పాలకులు, ఇశ్రాయేలు జవాబుదారీగా పిలవబడతారు ఎందుకంటే వారి నాయకత్వం ఉరిగా మారింది. గర్వం నిజమైన తిరిగి రావడాన్ని నిరోధిస్తుంది, తీర్పు క్షీణతలా వ్యాపిస్తుంది తరువాత సింహంలా దాడి చేస్తుంది. ఇశ్రాయేలు, యూదా అష్షూరు నుండి సహాయం కోరతారు, కానీ విదేశీ శక్తి వారిని స్వస్థపరచలేదు.
నాయకత్వంగర్వంతీర్పుతప్పుడు భద్రత
1“యాజకులారా! ఇది వినండి, ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి, రాజ వంశస్థులారా! వినండి, ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది: మీరు మిస్పాలో ఉరిగా, తాబోరు మీద వలలా ఉన్నారు.
2తిరుగుబాటుదారులు ఘోరమైన హత్యలు చేశారు. వారందరిని నేను శిక్షిస్తాను.
3ఎఫ్రాయిం గురించి నాకు అంతా తెలుసు; ఇశ్రాయేలు నా నుండి దాచబడలేదు. ఎఫ్రాయిమూ! ఇప్పుడు నీవు వ్యభిచారం వైపు తిరిగావు; ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.
4“వారి పనుల వలన వారు తమ దేవుని దగ్గరకు తిరిగి రారు. వారి హృదయాల్లో వ్యభిచార ఆత్మ ఉంది; వారు యెహోవాను గుర్తించరు.
5ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది; ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిమువారు కూడా తమ పాపంలో తడబడతారు; యూదా కూడా వారితో తడబడుతుంది.
6వారు యెహోవాను వెదకడానికి తమ గొర్రెలను, పశువులను వెంటబెట్టుకొని వెళ్లినప్పుడు, ఆయనను కనుగొనరు; ఎందుకంటే ఆయన వారికి దూరంగా ఉన్నారు.
7వారు యెహోవా పట్ల అపనమ్మకంగా ఉన్నారు; వారు అక్రమ సంతానాన్ని కన్నారు. వారు అమావాస్య ఉత్సవాలు జరుపుకున్నప్పుడు, ఆయన వారి భూములను నాశనం చేస్తారు.
8“గిబియాలో బాకానాదం చేయండి, రామాలో బూర ఊదండి. బెన్యామీనూ, నీ వెనుకే వస్తున్నాము; బేత్-ఆవెనులో యుద్ధ నినాదాలు చేయండి.
9దండన రోజున ఎఫ్రాయిం పాడైపోతుంది. తప్పనిసరిగా జరగబోయే దానిని నేను ఇశ్రాయేలు గోత్రాలకు ప్రకటిస్తున్నాను.
10యూదా నాయకులు సరిహద్దు రాళ్లను జరిపే వారిలా ఉన్నారు. వారి మీద నా కోపాన్ని నీటి ప్రవాహంలా కుమ్మరిస్తాను.
11ఎఫ్రాయిమీయులు విగ్రహాల వెంట వెళ్తున్నారు కాబట్టి వారు హింసించబడతారు, తీర్పులో త్రొక్కబడతారు.
12నేను ఎఫ్రాయిం వారికి చిమ్మెట పురుగులా ఉన్నాను, యూదా ప్రజలకు కుళ్లు పట్టించే తెగులుగా ఉంటాను.
13“ఎఫ్రాయిం తన రోగాన్ని, యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి గొప్ప రాజును సహాయం కోరాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, నీ పుండ్లను స్వస్థపరచలేదు.
14ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా యూదాకు కొదమసింహంలా ఉంటాను. నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు.
15వారు తమ అపరాధం ఒప్పుకుని నన్ను వెదికే వరకు నేను నా స్థలానికి తిరిగి వెళ్తాను, వారు తమ దురవస్థలో నన్ను తీవ్రంగా వెదకుతారు.”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.