
హోషేయ 12
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఎఫ్రాయిము గాలిని తింటుంది, మోసాన్ని గుణిస్తుంది, అస్థిర ఒప్పందాలను వెంబడిస్తుంది. హోషేయ యాకోబు పట్టుకోవడం, పోరాడటం, ప్రార్థన, సేవను గుర్తుచేసుకుని, ఇశ్రాయేలును స్థిరమైన ప్రేమ, న్యాయంతో తిరిగి రమ్మని ప్రోత్సహిస్తాడు. నిజాయితీలేని సంపద దోషాన్ని దాచలేదు, దేవుడు ప్రవక్తల ద్వారా, గుర్తుచేసుకున్న విడుదల ద్వారా మాట్లాడటం కొనసాగిస్తాడు.
మోసంయాకోబుతిరిగి రావడంన్యాయం
1ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.
2యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు; ఆయన యాకోబును తన మార్గాలను బట్టి శిక్షిస్తారు ఆయన అతని క్రియలనుబట్టి అతనికి ప్రతిఫలం ఇస్తారు.
3తల్లి గర్భంలో అతడు తన సోదరుని కాలి మడమను పట్టుకున్నాడు; అతడు పెద్దవాడయ్యాక దేవునితో పోరాడాడు.
4అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు; అతడు ఏడ్చి, దయచూపమని వేడుకున్నాడు. బేతేలులో అతడు దేవున్ని కనుగొన్నాడు అక్కడ అతడు ఆయనతో మాట్లాడాడు.
5ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా, ఆయన పేరు యెహోవా!
6అయితే నీవు నీ దేవుని దగ్గరకు తిరిగి రావాలి; ప్రేమ, న్యాయం కలిగి ఉండాలి, నీ దేవుని కోసం ఎల్లప్పుడు వేచి ఉండాలి.
7వ్యాపారి తప్పుడు తూకం వాడుతూ మోసం చేయడానికి ఇష్టపడతాడు.
8“నేను చాలా ధనవంతుడను; నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు.
9“మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీ నియమించబడిన పండుగ రోజుల్లో ఉన్నట్లు నేను మిమ్మల్ని మరలా గుడారాల్లో నివసింపజేస్తాను.
10నేను ప్రవక్తలతో మాట్లాడాను. వారికి అనేక దర్శనాలను ఇచ్చి ఉపమానరీతిగా వారికి చెప్పాను.”
11గిలాదు చెడ్డదా? దాని ప్రజలు వ్యర్థమైన వారు! వారు గిల్గాలులో కోడెలను బలి అర్పిస్తున్నారా? వారి బలిపీఠాలు దున్నబడిన పొలంలోని రాళ్ల కుప్పల్లా ఉన్నాయి.
12యాకోబు అరాము దేశానికి పారిపోయాడు; ఇశ్రాయేలు భార్యను పొందడానికి సేవ చేశాడు, భార్యను సంపాదించడానికి గొర్రెలు కాచాడు.
13యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకురావడానికి ఒక ప్రవక్తను వాడుకున్నారు, ప్రవక్త ద్వారా ఆయన వారిని సంరక్షించారు.
14కాని ఎఫ్రాయిం ఆయన మహా కోపాన్ని రేపాడు అతడు చేసిన రక్తపాతం బట్టి దేవుడు అతని మీద నేరం మోపుతారు అతని ధిక్కారం బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తారు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.