Families teaching one another from blank scrolls as sunrise fills a renewed communal home

హెబ్రీ పత్రిక 8

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
కేంద్ర బిందువు నిజమైన పరలోక పవిత్ర స్థలంలో సేవ చేస్తూ, మెరుగైన ఒడంబడికకు మధ్యవర్తిత్వం వహించే ప్రధాన యాజకుడు. యిర్మీయాను ఉల్లేఖిస్తూ, అధ్యాయం లోపల ఉంచిన దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ప్రత్యక్ష జ్ఞానాన్ని, తప్పిదానికి దయను, నూతనం చేయబడిన ఒడంబడికను వివరిస్తుంది.
మెరుగైన ఒడంబడికనిజమైన పవిత్ర స్థలంఅంతర్గత ధర్మశాస్త్రందయ
1మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగి ఉన్నాం,
2ఆయన మానవుని చేత కాక దేవుని చేత తయారుచేయబడిన నిజమైన ప్రత్యక్షగుడారంలో అతిపరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు.
3ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను బలులను అర్పించడానికి నియమించబడి ఉన్నాడు కాబట్టి ఈయన కూడ దేవునికి ఏదైనా సమర్పించాల్సిన అవసరం ఉండింది.
4ఆయన భూమి మీద ఉండి ఉంటే, ఒక యాజకుడై ఉండేవాడు కాడు, ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్న ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఇప్పటికే ఉన్నారు.
5పరలోకంలో ఉన్న దానికి కేవలం ఒక నమూనాగా ఛాయాచిత్రంగా ఉన్న పరిశుద్ధ స్థలంలో యాజకులుగా వారు సేవ చేస్తారు. ఇందుకే మోషే గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు దాన్ని గురించి ఇలా హెచ్చరిక పొందాడు: “పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే ప్రతిదీ చేసేలా చూడాలి.”
6అయితే నిజానికి నూతన నిబంధన మరింత గొప్ప వాగ్దానాలపై స్థాపించబడింది కాబట్టి, యేసు మధ్యవర్తిగా ఉన్న ఈ నిబంధన గత నిబంధన కన్న శ్రేష్ఠమైనదైనట్లే ఆయనకు అప్పగించబడిన పరిచర్య కూడా శ్రేష్ఠమైనదే.
7అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు.
8అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పారు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజులు వస్తున్నాయి, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేస్తాను.
9ఆ నిబంధన, ఈజిప్టు దేశం నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకొని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు, అందుకే నేను వారి నుండి దూరమయ్యాను, అని ప్రభువు చెప్తున్నారు.
10ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.
11ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘ప్రభువును తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు.
12ఎందుకంటే నేను దయతో వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”
13ఆయన ఈ నిబంధనను, “క్రొత్త” అని పిలువడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.