
యెహెజ్కేలు 19
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఒక విలాపం యూదా రాజ వంశాన్ని బలమైన కూనలను పట్టుకుని తీసుకువెళ్లే ఆడసింహంగా చిత్రిస్తుంది. చిత్రం పెకలించి, తూర్పు గాలిచే ఎండిపోయి, అగ్నిచే మింగబడిన వర్ధిల్లుతున్న ద్రాక్షావల్లిగా మారుతుంది, పరిపాలించే కొమ్మను వదలకుండా.
విలాపంరాజరికంసింహంద్రాక్షావల్లి
1“నీవు ఇశ్రాయేలీయుల అధిపతుల గురించి విలాప గీతం పాడి ఇలా చెప్పు:
2“ ‘నీ తల్లి ఎలాంటిది అంటే సింహాల మధ్యలో ఆడసింహం లాంటిది. కొదమ సింహాల మధ్య పడుకుని తన పిల్లలను పెంచింది.
3ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు అది బలమైన సింహం అయ్యింది. అది వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది.
4దాని గురించి ఇతర జనాంగాలు విని తమ గోతిలో దానిని పట్టుకున్నారు. దానికి గాలం తగిలించి ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు.
5“ ‘అది చూసిన దాని తల్లి తన ఆశ నిరాశ అయ్యిందని తన పిల్లల్లో మరో దానిని తీసుకుని బలమైన సింహంగా తయారుచేసింది.
6ఇది కూడా కొదమ సింహమై, మిగిలిన కొదమ సింహాలతో పాటు తిరుగుతూ వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది.
7అది వారి బలమైన కోటలను పడగొట్టి వారి పట్టణాలను పాడుచేసింది. దాని గర్జన విని దేశంతో పాటు దేశంలో ఉన్నదంతా పాడైపోయింది.
8నాలుగు వైపుల ఉన్న దేశాల ప్రజలందరూ దానిని పట్టుకోవడానికి వచ్చి దాని కోసం తమ వలలు పన్ని తమ గోతిలో దానిని చిక్కించుకున్నారు.
9దానికి గాలం తగిలించి బోనులో పెట్టి బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు. ఇశ్రాయేలీయుల పర్వతాలమీద దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా వారు దానిని చెరసాలలో ఉంచారు.
10“ ‘నీ తల్లి నీ ద్రాక్షతోటలో నీటి ప్రక్కన నాటబడిన ద్రాక్షవల్లిలాంటిది; నీరు సమృద్ధిగా ఉన్నందున అది ఫలించి అనేక కొమ్మలతో నిండి ఉంది.
11పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మలు దానికున్నాయి. అది మేఘాలను తాకే అంతగా పైకి పెరిగింది దానికున్న అనేక కొమ్మలతో ఏపుగా పెరిగింది.
12అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి నేల మీద పారవేయబడింది. తూర్పు గాలి వీచగా దాని పండ్లు వాడిపోయాయి; బలమైన దాని కొమ్మలు అగ్నిలో పడి కాలిపోయాయి.
13ఇప్పుడది అరణ్యంలో పూర్తిగా ఎండిపోయిన నీళ్లు లేని ఎడారిలో నాటబడింది.
14దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి దాని పండ్లను కాల్చివేసింది. పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’ ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.