Bezalel and other artisans crafting the ark, bread table, lampstand, and incense altar

నిర్గమ 37

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నిర్గమకాండము 37 బెసలేలు మందసము, దాని మూత, బల్ల, దీపస్తంభం, ధూప బలిపీఠం నిర్మాణాన్ని వివరిస్తుంది. అధ్యాయం పవిత్ర అభిషేక నూనె, ధూపం సిద్ధతను కూడా గుర్తించి, పవిత్ర గుడారం సూచనలు జాగ్రత్తగా అమలు చేయబడుతున్నాయని చూపిస్తుంది.
మందసముబల్లదీపస్తంభంనైపుణ్యం
1బెసలేలు తుమ్మకర్రతో మందసం తయారుచేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర.
2అతడు దాని లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేశాడు.
3నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు.
4తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాడు.
5వాటిని మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాడు.
6అతడు స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేశాడు; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉంది.
7తర్వాత అతడు సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను తయారుచేశాడు.
8అతడు ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేశాడు; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేశాడు.
9ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉన్నాయి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి, ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉన్నాయి.
10వారు తుమ్మకర్రతో ఒక బల్లను చేశారు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర.
11తర్వాత వారు దాన్ని స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును చేశారు.
12అలాగే దాని చుట్టూ బెత్తెడు వెడల్పున చట్రం కూడా చేసి దానిపై బంగారంతో పొదిగించారు.
13ఆ బల్లకు నాలుగు ఉంగరాలు చేసి వాటిని నాలుగు కాళ్లు ఉన్న నాలుగు మూలల్లో తగిలించారు.
14బల్ల మోయడానికి ఉపయోగించే మోతకర్రలు ఉంచే ఉంగరాలు చట్రానికి దగ్గరగా పెట్టారు.
15ఆ బల్లను మోయడానికి తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారంతో పొదిగించారు.
16బల్ల యొక్క ఉపకరణాలు అనగా దాని పళ్లెములు, పాత్రలు, పానార్పణలు పోయడానికి ఉపయోగించే బానలు గిన్నెలను స్వచ్ఛమైన బంగారంతో తయారుచేశాడు.
17వారు స్వచ్ఛమైన బంగారంతో దీపస్తంభం చేశారు. దాని అడుగు పీఠాన్ని నడిమి భాగాన్ని సుత్తెతో సాగగొట్టారు, దాని కలశాలు, దాని మొగ్గలు దాని పువ్వులు తయారుచేసి వాటితో ఒకే ఖండంలా చేశారు.
18దీపస్తంభానికి రెండు వైపుల నుండి ఆరు కొమ్మలు; ఒక ప్రక్క మూడు మరొక ప్రక్క మూడు కొమ్మలు విస్తరించి ఉన్నాయి.
19ఒక కొమ్మకు మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన మూడు కలశాలు, తర్వాతి కొమ్మకు కూడా అలాగే మూడు కలశాల చొప్పున దీపస్తంభం నుండి విస్తరించివున్న ఆరు కొమ్మలకు అదే విధంగా ఉన్నాయి.
20దీపస్తంభం మీద మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన నాలుగు కలశాలు ఉన్నాయి.
21దీపస్తంభం నుండి విస్తరించి ఉన్న మొదటి జత కొమ్మల క్రింద మొదటి మొగ్గ, రెండవ జత కొమ్మల క్రింద రెండవ మొగ్గ, మూడవ జత కొమ్మల క్రింద మూడవ మొగ్గ చొప్పున ఆరు కొమ్మలకు అమర్చారు.
22సాగగొట్టబడిన స్వచ్ఛమైన బంగారంతో మొగ్గలు కొమ్మలు దీపస్తంభంతో ఒకే ఖండంగా చేశారు.
23వారు ఏడు దీపాలు దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేశారు.
24దీపస్తంభాన్ని దాని ఉపకరణాలను తయారుచేయడానికి ఒక తలాంతు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.
25వారు తుమ్మకర్రతో ఒక ధూపవేదిక తయారుచేశారు. అది చతురస్రంగా ఒక మూర పొడవు ఒక మూర వెడల్పు రెండు మూరల ఎత్తు ఉంది. దాని కొమ్ములను దానితో ఒకే ఖండంగా ఉండేలా చేశారు.
26దాని పైభాగానికి, అన్ని ప్రక్కలకు, కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు కడ్డీ చేశారు.
27మోయడానికి ఉపయోగించే మోతకర్రలను పెట్టడానికి, కడ్డీ క్రింద రెండు బంగారు ఉంగరాలు, ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా తయారుచేశారు.
28వారు తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించారు.
29అంతేకాక వారు పవిత్ర అభిషేక తైలాన్ని, స్వచ్ఛమైన, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ వాసనగల ధూపాన్ని తయారుచేశారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.