Skilled artisans crafting the ark, bread table, and lampstand from donated materials

నిర్గమ 25

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
నిర్గమకాండము 25 పవిత్ర గుడారం కోసం స్వచ్ఛంద కానుకలను ఆహ్వానించి దాని రూపకల్పనను ప్రారంభిస్తుంది. దేవుడు మోషేకు మందసము, దాని మూత, సన్నిధి రొట్టె బల్ల, ఏడు కొమ్మల దీపస్తంభం గురించి సూచనలు ఇచ్చి, ఇశ్రాయేలు మధ్య ఆరాధన కోసం పవిత్ర సామగ్రిని స్థాపిస్తాడు.
స్వచ్ఛంద కానుకలుమందసమురొట్టె బల్లదీపస్తంభం
1యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
2“నాకు ఒక అర్పణ తీసుకురావాలి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతిఒక్కరి నుండి నీవు నా కోసం కానుక తీసుకోవాలి.
3“నీవు వారి దగ్గర నుండి తీసుకోవలసిన కానుకలు ఇవే: “బంగారం, వెండి, ఇత్తడి;
4నీలం ఊదా ఎరుపు రంగుల నూలు, సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు;
5ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు, మన్నికైన తోలు ; తుమ్మకర్ర;
6దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి, సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;
7ఏఫోదు మీద, రొమ్ము పతకం మీద పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు.
8“నేను వారి మధ్య నివసించేలా వారు నా కోసం పరిశుద్ధాలయాన్ని నిర్మించాలి.
9ఈ సమావేశ గుడారాన్ని, దాని అన్ని అలంకరణలను నేను మీకు చూపించే నమూనా వలె చేయండి.
10“వారు తుమ్మకర్రతో మందసం తయారుచేయాలి. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.
11లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేయాలి.
12నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
13తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి.
14మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాలి.
15ఈ మందసపు ఉంగరాల్లో మోతకర్రలు అలాగే ఉండాలి; వాటిని తీసివేయకూడదు.
16అప్పుడు నేను మీకు ఇచ్చే ఒడంబడిక పలకలను మందసంలో ఉంచండి.
17“స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేయాలి; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి.
18తర్వాత సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను తయారుచేయాలి.
19ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేయాలి; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేయాలి.
20ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉండాలి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉండాలి.
21ప్రాయశ్చిత్త మూతను పైకెత్తి మందసం మీద ఉంచి మందసంలో నేను మీకిచ్చే ఒడంబడిక పలకలను పెట్టాలి.
22అక్కడ, నిబంధన మందసం పైన ఉన్న ఆ ప్రాయశ్చిత్త మూత మీదుగా రెండు కెరూబుల మధ్యలో నుండి, నేను నిన్ను కలుసుకొని ఇశ్రాయేలీయుల కోసం నా ఆజ్ఞలన్నిటిని నీకు ఇస్తాను.
23“తుమ్మకర్రతో ఒక బల్లను చేయాలి. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.
24దాన్ని స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును చేయించారు.
25అలాగే దాని చుట్టూ బెత్తెడు వెడల్పున చట్రం కూడా చేసి దానిపై బంగారంతో పోతపోయాలి.
26ఆ బల్లకు నాలుగు ఉంగరాలు చేసి వాటిని నాలుగు కాళ్లు ఉన్న నాలుగు మూలల్లో తగిలించాలి.
27బల్ల మోయడానికి ఉపయోగించే మోతకర్రలు ఉంచే ఉంగరాలు చట్రానికి దగ్గరగా పెట్టబడాలి.
28తుమ్మకర్రతో మోతకర్రలు చేసి, వాటికి బంగారు పోతపోసి వాటితో ఆ బల్లను మోయాలి.
29దాని పళ్లెములు పాత్రలు, పానార్పణలు పోయడానికి ఉపయోగించే బానలు గిన్నెలను స్వచ్ఛమైన బంగారంతో తయారుచేయాలి.
30అన్ని వేళలా నా ఎదుట సన్నిధి రొట్టెలను ఈ బల్లమీద ఉంచాలి.
31“స్వచ్ఛమైన బంగారంతో దీపస్తంభం చేయాలి. దాని అడుగు పీఠాన్ని నడిమి భాగాన్ని సుత్తెతో సాగగొట్టాలి, దాని కలశాలు దాని మొగ్గలు దాని పువ్వులు తయారుచేసి వాటితో ఒకే ఖండంలా చేయాలి.
32దీపస్తంభానికి రెండు వైపుల నుండి ఆరు కొమ్మలు; ఒక ప్రక్క మూడు మరొక ప్రక్క మూడు కొమ్మలు విస్తరించి ఉండాలి.
33ఒక కొమ్మకు మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన మూడు కలశాలు, తర్వాతి కొమ్మకు కూడా అలాగే మూడు కలశాల చొప్పున దీపస్తంభం నుండి విస్తరించివున్న ఆరు కొమ్మలకు అదే విధంగా ఉండాలి.
34దీపస్తంభం మీద మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన నాలుగు కలశాలు ఉండాలి.
35దీపస్తంభం నుండి విస్తరించి ఉన్న మొదటి జత కొమ్మల క్రింద మొదటి మొగ్గ, రెండవ జత కొమ్మల క్రింద రెండవ మొగ్గ, మూడవ జత కొమ్మల క్రింద మూడవ మొగ్గ చొప్పున ఆరు కొమ్మలకు అమర్చాలి.
36సాగగొట్టబడిన స్వచ్ఛమైన బంగారంతో మొగ్గలు కొమ్మలు దీపస్తంభంతో ఒకే ఖండంగా చేయాలి.
37“తర్వాత దాని ఏడు దీపాలు తయారుచేసి దాని ఎదుట భాగం ప్రకాశించేలా వాటిని వెలిగించాలి.
38దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేయాలి.
39దీపస్తంభాన్ని దాని ఉపకరణాలను తయారుచేయడానికి ఒక తలాంతు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాలి.
40పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే నీవు వాటిని చేసేలా చూడాలి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.