
ఎఫెసీ పత్రిక 4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
వినయం, సహనం, ప్రేమతో జీవించి, ఆత్మ ఐక్యతను కాపాడమని పౌలు విశ్వాసులను కోరతాడు. క్రీస్తు కానుకలు మొత్తం శరీరాన్ని పరిపక్వతకు సిద్ధం చేస్తాయి, నూతన జీవన విధానం మోసం, అవినీతి మాట, చేదు, దొంగతనాన్ని సత్యం, దయతో భర్తీ చేస్తుంది.
ఐక్యతఆధ్యాత్మిక వరాలుపరిపక్వతనూతనీకరించిన ప్రవర్తన
1మీరు పిలువబడిన పిలుపుకు యోగ్యులుగా నడుచుకోవాలని ప్రభువు యొక్క ఖైదీనైన నేను మిమ్మల్ని కోరుతున్నాను.
2ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకుంటూ పూర్ణ వినయంతో సాత్వికంతో, దీర్ఝశాంతంతో ఉండండి.
3మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి.
4శరీరం ఒక్కటే; ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీరు పిలువబడినప్పుడు ఒకే నిరీక్షణ కోసం పిలువబడ్డారు;
5ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే;
6అందరికి తండ్రియైన దేవుడు ఒక్కరే, ఆయనే అందరికి పైగా ఉన్నవారు, అందరి ద్వారా వ్యాపించి అందరిలో ఉన్నారు.
7అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది.
8అందుకే, ఈ విధంగా చెప్పబడింది: “ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లి, తన ప్రజలకు బహుమానాలను అనుగ్రహించారు.”
9ఆయన ఆరోహణం అయ్యారంటే ఆయన క్రిందకు, భూమి మీదకు దిగివచ్చారని దాని అర్థం కాదా?
10క్రిందకు దిగివచ్చినవాడే, సమస్త ప్రపంచాన్ని నింపడానికి ఆకాశ మండలాలన్నింటి కంటే పైగా ఆరోహణమయ్యారు.
11మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడేలా తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు.
14మనం ఇంకా పసిపిల్లలం కాదు కాబట్టి, మనుష్యులు మోసపూరిత యోచనలతో వంచనలతో కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతీ గాలికి ఇటు అటు ఎగిరిపోతూ, అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొనిపోయేవారంగా ఉండకూడదు.
15ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము.
16ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది.
17కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
18వారు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి తమలో ఉన్న అజ్ఞానం కారణంగా దేవుని నుండి వచ్చే జీవం నుండి వేరుపరచబడి గ్రహించుటలో గ్రుడ్డివారిగా ఉన్నారు.
19వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు.
20అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.
22మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి,
23మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి;
24నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.
25కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము.
26“మీ కోపంలో పాపం చేయకండి” : సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి.
27అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి.
28దొంగతనం చేసేవారు ఇకమీదట దొంగతనం చేయకూడదు, కానీ తమ చేతులతో అవసరమైన మంచి పనులను చేస్తూ, కష్టపడుతూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.
29మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి.
30విమోచన దినం కోసం మీరు ఎవరితో ముద్రించబడ్డారో ఆ దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి.
31అదే విధంగా, ద్వేషమంతటిని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణను, ప్రతి విధమైన దుష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టండి.
32క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిపట్ల ఒకరు దయా, కనికరం కలిగి ఉండండి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.