
ప్రసంగి 6
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఒక వ్యక్తి సంపద, గౌరవం, అనేక పిల్లలు, దీర్ఘ జీవితాన్ని పొందవచ్చు కానీ వాటిని ఆనందించలేకపోవచ్చు. ఆకలి ఎన్నడూ పూర్తిగా తృప్తిపడదు, జ్ఞానం, పేదరికం రెండూ మానవ పరిమితులను తొలగించవు. జీవితం నీడలా గడిచిపోతుంది, భవిష్యత్తు తెలియకుండా ఉంటుంది.
తృప్తికరం కాని కోరికసంపదఆనందంమానవ పరిమితులుఅనిశ్చితి
1నేను సూర్యుని క్రింద మరొక చెడు చూశాను, అది మనుష్యజాతి మీద ఎంతో భారంగా ఉంది.
2దేవుడు కొందరికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తారు, తద్వార వారి హృదయాలు కోరుకున్నవేవి వారికి కొదువగా ఉండవు. కాని వాటిని అనుభవించే సామర్థ్యాన్ని వారికి దేవుడు ఇవ్వరు, అపరిచితులు వాటిని అనుభవిస్తారు. ఇదంతా అర్థరహితమే, చెడ్డ విషయమే.
3ఒకడు వందమంది పిల్లలను కని అనేక సంవత్సరాలు జీవించినప్పటికీ, అతడు బ్రతికినంత కాలం తన అభివృద్ధిని అనుభవించకపోతే, సరియైన రీతిలో సమాధి చేయబడకపోతే, అతనికంటే గర్భస్రావమైపోయిన పిండమే నయము.
4గర్భస్రావమైన పిండం నిరుపయోగంగా వచ్చి చీకటిలోకి వెళ్లిపోతుంది, చీకటిలో దాని పేరు కప్పబడుతుంది.
5అది ఎన్నడు సూర్యుని చూడకపోయినా దానికి ఏమి తెలియకపోయినా, ఆ మనిషి కన్నా దానికే ఎక్కువ విశ్రాంతి ఉంది.
6అతడు రెండువేల సంవత్సరాలు బ్రతికినా తన అభివృద్ధిని అనుభవించలేడు. అందరు వెళ్లేది ఒకే చోటికే కదా?
7మనుష్యులు పడే శ్రమ అంతా కడుపు కోసమే, అయినా వారి ఆశకు తృప్తి కలగదు.
8మూర్ఖుల కంటే జ్ఞానులకున్న ప్రయోజనం ఏముంది? ఇతరుల ఎదుట ఎలా జీవించాలో తెలుసుకున్న బీదవారికి లాభం ఏంటి?
9కోరిక వెంట పడడం కంటే కళ్లకు కనిపించేది మేలు. అయినా ఇది కూడా అర్థరహితమే. గాలికి ప్రయాసపడడమే.
10ఉనికిలో ఉన్నవన్నీ ఇంతకు ముందు తెలిసినవే. మనుష్యులు ఎలా ఉంటారో పూర్వం నుండి తెలిసిందే; తనకంటే బలవంతుడితో ఎవరు పోరాడలేరు.
11మాటలు ఎక్కువ అర్థం తక్కువ, దానివల్ల ఎవరికి ప్రయోజనం?
12నీడలా తమ జీవితకాలాన్ని అర్థరహితంగా గడిపే మనుష్యుల బ్రతుకులో వారికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు? వారు గతించాక సూర్యుని క్రింద భూమి మీద ఏం జరుగుతుందో వారికి ఎవరు చెప్తారు?
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.