Two Israelite neighbors lifting a fallen donkey while another returns a lost sheep

ద్వితీయో 22

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ద్వితీయోపదేశకాండము 22 ఆచరణాత్మక పొరుగువారి కవనిప్పును ఇంటి, లైంగిక సరిహద్దులతో కలుపుతుంది. ఇశ్రాయేలీయులు తప్పిపోయిన ఆస్తిని తిరిగి ఇవ్వాలి, బాధలో ఉన్న జంతువులకు సహాయం చేయాలి, పైకప్పులను రక్షించాలి, సృష్టిని గౌరవించాలి. అధ్యాయం వస్త్రధారణ, వ్యవసాయం, వివాహ ఆరోపణలు, వ్యభిచారం, దాడి, లైంగిక తప్పు బాధ్యతను కూడా పరిష్కరిస్తుంది.
పొరుగు కవనిప్పుభద్రతకుటుంబ సరిహద్దులుబాధ్యత
1మీ తోటి ఇశ్రాయేలీయుల ఎద్దు లేదా గొర్రెలు దారితప్పినట్లు మీరు చూస్తే దానిని విస్మరించవద్దు. కానీ దానిని తిరిగి దాని యజమాని దగ్గరకు తీసుకెళ్లండి.
2ఒకవేళ వారు మీ దగ్గర నివసించకపోయినా లేదా దాని యజమాని ఎవరో మీకు తెలియకపోయినా, దానిని మీతో ఇంటికి తీసుకెళ్లి, వారు దానిని వెదుక్కునే వరకు ఉంచి, తర్వాత తిరిగి ఇచ్చేయండి.
3గాడిద గాని వస్త్రం గాని మరి ఏ వస్తువైనా దొరికితే ఇలాగే చేయాలి. దాన్ని విస్మరించవద్దు.
4మీ తోటి ఇశ్రాయేలీయుని గాడిద గాని ఎద్దు గాని దారిలో పడి ఉండడం మీరు చూస్తే, దానిని విస్మరించవద్దు. అది తిరిగి లేచి నిలబడేలా దాని యజమానికి సహాయం చేయండి.
5స్త్రీలు పురుషుల దుస్తులు వేసుకోకూడదు, పురుషులు స్త్రీల వస్త్రాలు వేసుకోకూడదు, ఎందుకంటే అలా చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.
6రోడ్డు ప్రక్కన, చెట్టు ప్రక్కన లేదా నేలపై పక్షుల గూడు కనిపిస్తే, తల్లి చిన్నపిల్లలపై లేదా గుడ్లపై కూర్చుంటే, తల్లిని పిల్లలతో తీసుకెళ్లవద్దు.
7మీరు పిల్లలను తీసుకెళ్లవచ్చు, కాని తల్లిని వదిలేయాలి, తద్వార మీరు బాగుంటారు దీర్ఘాయువు కలిగి ఉంటారు.
8మీరు ఒక క్రొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు, మీ పైకప్పు చుట్టూ ఒక పిట్టగోడను కట్టుకోండి, తద్వారా ఎవరైనా పైకప్పు నుండి క్రింద పడితే మీ ఇంటిపైకి రక్తపాతం యొక్క అపరాధం తీసుకురాదు.
9మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను నాటవద్దు; మీరు అలా చేస్తే, మీరు వేసే పంటలు మాత్రమే కాకుండా ద్రాక్షతోట యొక్క పండు కూడా అపవిత్రమవుతుంది.
10ఒక ఎద్దును ఒక గాడిదను జతచేసి దున్నకూడదు.
11ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టలు ధరించకూడదు.
12మీరు ధరించే వస్త్రం యొక్క నాలుగు మూలల్లో కుచ్చులు చేయండి.
13ఒకవేళ ఒక వ్యక్తి భార్యను తీసుకుని, ఆమెతో పడుకున్న తర్వాత, ఆమెను ఇష్టపడక,
14ఆమెను దూషించి, ఆమె పేరు చెడ్డ చేసి, “నేను ఈ స్త్రీని పెళ్ళి చేసుకున్నాను, కానీ నేను ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు, ఆమె కన్యత్వానికి రుజువు దొరకలేదు” అని చెప్తే,
15అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు ఆమె కన్య అనే రుజువును పట్టణ పెద్దల దగ్గరకు తీసుకురావాలి.
16ఆమె తండ్రి పెద్దలతో, “నేను నా కుమార్తెను ఈ వ్యక్తికిచ్చి పెళ్ళి చేశాను, కాని అతనికి ఆమెపై ఇష్టం లేదు.
17ఇప్పుడు అతడు ఆమెను దూషించి, ‘మీ కుమార్తె కన్యగా నాకు కనిపించలేదు’ అని అంటున్నాడు. కానీ, నా కుమార్తె కన్యత్వానికి ఇది రుజువు” అని ఆమె తల్లిదండ్రులు పట్టణ పెద్దల ముందు వస్త్రాన్ని ప్రదర్శించాలి,
18పట్టణ పెద్దలు ఆ వ్యక్తిని తీసుకెళ్లి అతన్ని శిక్షించాలి.
19వారు అతనికి వంద షెకెళ్ళ వెండి జరిమానా విధించి, ఆ యువతి తండ్రికి ఇవ్వాలి, ఎందుకంటే ఈ వ్యక్తి ఇశ్రాయేలు కన్యకు చెడ్డ పేరు పెట్టాడు. ఆమె అతని భార్యగా ఉంటుంది; అతడు బ్రతికున్నంత కాలం అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
20ఒకవేళ, ఆరోపణ నిజమైతే ఆ యువతి కన్యత్వానికి రుజువు దొరకనట్లైతే,
21ఆమెను తన తండ్రి ఇంటి తలుపు దగ్గరకు తీసుకురావాలి; అక్కడ ఆ పట్టణ పురుషులు ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు వేశ్యావృత్తి చేయడం ద్వారా ఆమె ఇశ్రాయేలులో తప్పుడు పని చేసింది. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.
22ఒక వ్యక్తి మరొకరి భార్యతో పడుకున్నట్లు కనిపించినట్లయితే, ఆమెతో పడుకున్న వ్యక్తి, ఆ స్త్రీ ఇద్దరూ మరణించాలి. మీరు ఇశ్రాయేలు నుండి చెడును ప్రక్షాళన చేయాలి.
23ఒకవేళ ఒక పురుషుడు ఒక పట్టణంలో పెళ్ళి నిశ్చయమైన ఒక కన్యను కలవడం జరిగి, అతడు ఆమెతో పడుకున్నట్లైతే,
24మీరు వారిద్దరిని ఆ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి, ఆ యువతి పట్టణంలో ఉండి కూడా సహాయం కోసం కేకలు వేయనందుకు తనను, మరొక వ్యక్తి భార్యను చెరిపినందుకు అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ విధంగా మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.
25అయితే దేశంలో ఒకడు అనుకోకుండ పెళ్ళి నిశ్చయమైన ఒక యువతిని కలిసినప్పుడు, వాడు ఆమెను పాడు చేస్తే, అది చేసిన వ్యక్తి మాత్రమే చావాలి.
26స్త్రీని ఏమీ చేయవద్దు; ఎందుకంటే ఆమె చంపబడేంత పాపం చేయలేదు. ఈ దావా ఒక పొరుగువాని మీద దాడి చేసి హత్యచేసిన దానిలా ఉంది,
27ఎందుకంటే ఆ పురుషుడు దేశంలో ఆ యువతిని చూశాడు, నిశ్చితార్థమైన ఆ యువతి కేకలు వేసింది, కాని ఆమెను రక్షించడానికి ఎవరూ రాలేదు.
28ఒకవేళ ఒక పురుషుడు పెళ్ళి నిశ్చయం కాని ఒక కన్యను కలవడం జరిగి ఆమెను బలత్కారం చేసి వారు పట్టుబడితే,
29అతడు ఆమె తండ్రికి యాభై షెకెళ్ళ వెండి చెల్లించాలి. అతడు ఆ యువతిని అవమానించాడు కాబట్టి ఆమెను పెళ్ళి చేసుకోవాలి. అతడు బ్రతికున్నంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
30ఒక పురుషుడు తన తండ్రి భార్యను పెళ్ళి చేసుకోకూడదు; అతడు తన తండ్రి పడకను అగౌరపరచకూడదు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.