
ద్వితీయో 16
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ద్వితీయోపదేశకాండము 16 పస్కా, వారాల పండుగ, గుడారాల పండుగను సమీక్షించి, ఎంచుకున్న స్థలంలో ఆనందించమని కుటుంబాలను, లేవీయులను, బలహీన పొరుగువారిని పిలుస్తుంది. ఇది న్యాయాధిపతులను కూడా నియమించి పక్షపాతం, లంచం, విగ్రహారాధన వస్తువులు లేకుండా న్యాయం కోరుతుంది.
పస్కాపండుగలుఆనందంన్యాయం
1అబీబు నెలను ఆచరించి మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి, ఎందుకంటే అబీబు నెలలో రాత్రివేళ మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో నుండి మిమ్మల్ని తీసుకువచ్చారు.
2యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించి పశువుల్లో నుండి గాని మందలో నుండి గాని ఒక జంతువును బలి ఇవ్వాలి.
3పులిసిన దానితో చేసిన రొట్టెలు తినకూడదు, కాని మీరు ఈజిప్టులో నుండి త్వరగా బయలుదేరి వచ్చారు కాబట్టి, ఈజిప్టు దేశం నుండి వచ్చిన ఆ రోజును జీవితకాలమంతా జ్ఞాపకముంచుకోడానికి ఏడు రోజులు మీరు బాధను సూచించే రొట్టె అనగా పులియని రొట్టెలు తినాలి.
4ఆ ఏడు రోజులు మీ దేశంలో ఎక్కడా పులిసిన పదార్థమేదీ కనిపించకూడదు. మీరు మొదటి రోజు సాయంకాలం వధించిన బలి మాంసంలో ఏదీ ఉదయం వరకు మిగలకూడదు.
5మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఏర్పరచుకొనే స్థలంలో తప్ప ఆయన మీకు ఇచ్చే ఏ పట్టణాల్లో పస్కా పశువును అర్పించకూడదు. ఈజిప్టు నుండి మీరు బయలుదేరిన సందర్భంగా, సూర్యుడు అస్తమించే సమయంలో, సాయంకాలంలో ఆ స్థలంలోనే మీరు పస్కా పశువును బలి ఇవ్వాలి.
7మీ దేవుడైన యెహోవా ఎన్నుకునే స్థలంలో దానిని కాల్చి తినాలి. ఉదయం మీ గుడారాలకు తిరిగి వెళ్లాలి.
8ఆరు రోజులు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు ఒక సభను నిర్వహించాలి, అప్పుడు మీరు ఏ పని చేయకూడదు.
9పంటపై కొడవలి వేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్కించాలి.
10మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన దానిలో నుండి స్వేచ్ఛార్పణలు ఇవ్వడం ద్వారా మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగ ఆచరించాలి.
11మీరు, మీ కుమారులు, కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఆనందించాలి.
12మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ శాసనాలను జాగ్రత్తగా పాటించండి.
13మీరు మీ నూర్పిడి కళ్ళం నుండి ధాన్యాన్ని, ద్రాక్ష గానుగ తొట్టె నుండి ద్రాక్షరసాన్ని సమకూర్చుకున్న తర్వాత గుడారాల పండుగ ఏడు రోజులు ఆచరించాలి.
14మీరు, మీ కుమారులు కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు ఈ పండుగలో ఆనందించాలి.
15యెహోవా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవాకు మీరు ఈ పండుగ ఏడు రోజులు ఆచరించాలి. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటిలో మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది.
16సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో కనబడాలి: పులియని రొట్టెల పండుగలో, వారాల పండుగలో, గుడారాల పండుగలో. యెహోవా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
17మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన ప్రకారం మీలో ప్రతి ఒకరు తమ శక్తి కొద్ది కానుకలు తీసుకురావాలి.
18మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, అధికారులను మీరు నియమించాలి, వారు న్యాయంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.
19న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లేదా పక్షపాతం చూపించకూడదు. లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం జ్ఞానుల కళ్లకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
20మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో మీరు జీవించేలా న్యాయాన్ని కేవలం న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి.
21మీ దేవుడైన యెహోవాకు మీరు నిర్మించే బలిపీఠం ప్రక్కన ఏ అషేరా స్తంభాన్ని ఏర్పాటు చేయకూడదు,
22పవిత్ర రాతిని నిలబెట్టకూడదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు ఇవి అసహ్యము.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.