Israelite elders testing a persuasive guide who points toward a distant foreign shrine

ద్వితీయో 13

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ద్వితీయోపదేశకాండము 13 సంకేతాలు, కుటుంబ ఆప్యాయత లేదా సమాజ ఒత్తిడి ఇశ్రాయేలును ఇతర దేవుళ్ల వైపు లాగకూడదని హెచ్చరిస్తుంది. ప్రవచన వాదనలకు ఒడంబడిక వివేచన అవసరం, రహస్య ప్రలోభాన్ని ప్రతిఘటించాలి, తిరుగుబాటు పట్టణం గురించి నివేదికలకు తీర్పుకు ముందు జాగ్రత్తగా విచారణ అవసరం.
వివేచనపొய్ ప్రవక్తలువిశ్వసనీయతవిగ్రహారాధన
1ప్రవక్త గాని కలల ద్వారా భవిష్యత్తును చెప్పగలవారు గాని మీ మధ్యకు వచ్చి, మీ ఎదుట ఒక గుర్తును లేదా అద్భుతాన్ని ప్రకటిస్తే,
2ఒకవేళ చెప్పిన గుర్తు లేదా అద్భుతం జరిగి, ఆ ప్రవక్త, “మనం ఇతర దేవుళ్ళను అనుసరిద్దాం” (మీకు తెలియని దేవుళ్ళు) “వాటిని సేవిద్దాం” అని ప్రలోభపెడితే,
3ఆ ప్రవక్త మాటలు లేదా కలలు కనేవారి మాటలు గాని మీరు వినకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నారు.
4మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించి ఆయనకు భయపడాలి; ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడాలి; ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి.
5ఈజిప్టు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి, బానిస దేశం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద మీరు తిరుగుబాటు చేయడానికి వారు మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి వారు చంపబడాలి. ప్రవక్త లేదా కలలు కనేవారు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అనుసరించమని ఆజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని త్రిప్పివేయడానికి ప్రయత్నించారు. ఈ విధంగా మీ మధ్యలో నుండి చెడుతనాన్ని తొలగించాలి.
6మీ సొంత సోదరుడు లేదా మీ కుమారుడు గాని కుమార్తె గాని, లేదా మీరు ప్రేమిస్తున్న భార్య లేదా మీ ప్రాణస్నేహితుడు గాని రహస్యంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి, “మనం వెళ్లి ఇతర దేవుళ్ళను (మీకు గాని మీ పూర్వికులకు తెలియని దేవుళ్ళు, మీ చుట్టూ ఉన్న, మీకు దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న ప్రజల దేవుళ్ళు, భూమి ఒక చివరి నుండి ఇంకొక చివరి వరకు ఉన్న దేవుళ్ళు) సేవిద్దాం” అని చెప్తే,
8మీరు వారి మాటలు అంగీకరించవద్దు, వారి మాట వినవద్దు. వారి మీద జాలి చూపవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారిని కాపాడవద్దు.
9వారిని ఖచ్చితంగా చంపాల్సిందే. వారిని చంపడానికి మిగిలిన ప్రజలందరి కంటే ముందు మీ చేయి వారి మీద పడాలి.
10వారిని రాళ్లతో కొట్టి చంపాలి ఎందుకంటే, ఈజిప్టు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా దగ్గర నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు.
11అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడతారు, మీలో ఎవరూ మరలా అలాంటి దుర్మార్గం చేయరు.
12మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో దేనిలోనైనా దుష్టులు కొందరు మీ మధ్యలో లేచి, “మనం ఇతర దేవుళ్ళను సేవిద్దాం” అని చెప్పి (మీకు తెలియని దేవుళ్ళను) తమ పట్టణంలోని ప్రజలను ప్రోత్సహించినట్లు మీరు వినివుంటే,
14దాని గురించి మీరు విచారణ చేసి పూర్తిగా పరిశోధించి తెలుసుకోవాలి. అది నిజమై, మీ మధ్య ఈ అసహ్యకరమైన పని జరిగిందని నిరూపించబడితే,
15ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ఖచ్చితంగా ఖడ్గంతో సంహరించాలి; దానిలో ఉన్న సమస్తాన్ని, అంటే ప్రజలను పశువులను పూర్తిగా నాశనం చేయాలి.
16దానిలో ఉన్న విలువైన వస్తువులన్నిటిని పట్టణంలో మధ్యలోనికి తీసుకువచ్చి మీ దేవుడైన యెహోవాకు దహనబలిగా ఆ పట్టణాన్ని, దానిలోని వస్తువులను పూర్తిగా కాల్చివేయాలి. ఆ పట్టణం మరలా కట్టబడకుండా ఎల్లప్పుడు పాడుపడిన దానిగానే ఉండాలి,
17నాశనానికి చెందిన వాటిలో ఏది మీ దగ్గర ఉండకూడదు. అప్పుడు యెహోవా తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి, మిమ్మల్ని కనికరించి, మీమీద దయ చూపుతారు. మీ పూర్వికులకు ఇచ్చిన వాగ్దానం మేరకు మిమ్మల్ని అసంఖ్యాకంగా విస్తరింపజేస్తారు,
18ఎందుకంటే నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించడం ద్వారా, మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయత చూపించి ఆయన దృష్టిలో సరియైన వాటిని మీరు చేస్తున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.