
2 తిమోతి పత్రిక 4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ఓపికగా, పట్టుదలతో వాక్కును ప్రకటించమని పౌలు తిమోతిని గంభీరంగా ఆదేశిస్తాడు. తన మరణాన్ని ఊహిస్తూ, పౌలు మంచి పోరాటం పోరాడి పరుగును పూర్తి చేశానని చెప్పి, తరువాత విడనాడటం, దైవిక సహాయం, సహకారుల కదలికలు, చివరి శుభాకాంక్షలను గుర్తుచేసుకుంటాడు.
వాక్కును ప్రకటించడంపూర్తయిన పరుగుదైవిక సహాయంసహకారులు
1నేను దేవుని ఎదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు ఎదుట నీకు ఈ బాధ్యతను ఇస్తున్నాను:
2ఆతురత కలిగి అనుకూల సమయంలోను అనుకూలంగా లేని సమయంలోను సిద్ధంగా ఉండాలి; ఎంతో సహనంతో, సరియైన సూచనలతో ప్రజలను సరిదిద్దుతూ, గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ వాక్యాన్ని ప్రకటించు.
3ఎందుకంటే, ప్రజలు మంచిబోధను అంగీకరించని ఒక సమయం వస్తుంది. అప్పుడు వారు తమ సొంత ఆశలకు అనుగుణంగా తమ దురద చెవులు వినడానికి ఇష్టపడే వాటినే బోధించే అనేకమంది బోధకులను తమ చుట్టూ చేర్చుకుంటారు.
4వారు సత్యం నుండి తొలగిపోయి కట్టుకథలు వినడానికి తమ చెవులను అప్పగిస్తారు.
5కాని నీవైతే అన్ని పరిస్థితుల్లో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పని చేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.
6ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది.
7నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.
8కాబట్టి నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కోసం దాచబడి ఉంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కోసం ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.
9త్వరగా నా దగ్గరకు రావడానికి ప్రయత్నించు.
10దేమా ఈ లోకాన్ని ప్రేమించి, నన్ను వదిలి థెస్సలొనీక వెళ్లాడు. క్రేస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్లారు.
11లూకా మాత్రమే నాతో ఉన్నాడు. నా పరిచర్యలో మార్కు నాకు సహాయంగా ఉంటాడు, కాబట్టి అతన్ని నీతో పాటు తీసుకురా.
12నేను తుకికును ఎఫెసు పట్టణానికి పంపించాను.
13నీవు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచిన నా అంగీని, నా పుస్తకాలను మరి ముఖ్యంగా చర్మపు ప్రతులను వెంట తీసుకురా.
14కంసాలి పని చేసే అలెగ్జాండరు నాకు ఎంతో హాని చేశాడు. అతడు చేసిన పనులకు ప్రభువు వానికి తగిన ప్రతిఫలమిస్తారు.
15అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కాబట్టి నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు.
16నేను మొదటిసారి న్యాయసభలో నాపై వేయబడిన ఆరోపణలకు జవాబు ఇస్తున్నప్పుడు ఎవరూ నా పక్షాన నిలబడలేదు, అందరు నన్ను వదిలి వెళ్లిపోయారు. అది వారికి వ్యతిరేకంగా ఉండకూడదు
17కాని నా ప్రభువు నాకు తోడుగా నిలిచి నన్ను బలపరిచారు ఎందుకంటే, నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడి యూదేతరులంతా దానిని వినడానికి దేవుడు నన్ను సింహం నోటి నుండి విడిపించారు.
18నాకు కలిగే ప్రతి కీడు నుండి ప్రభువు నన్ను కాపాడి తన పరలోక రాజ్యంలోనికి క్షేమంగా చేర్చుకుంటారు. ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.
19అకుల ప్రిస్కిల్లకు, ఒనేసిఫోరు ఇంటి వారందరికి నా వందనాలు.
20ఎరస్తు కొరింథులోనే ఉండిపోయాడు, త్రోఫిముకు అనారోగ్యంగా ఉన్నందుకు నేను అతన్ని మిలేతులో వదిలి వచ్చాను.
21శీతాకాలం రాకముందే నీవు ఇక్కడకు రావడానికి ప్రయత్నించు. యుబూలు నీకు వందనాలు తెలియజేయమన్నాడు, అలాగే పూదే, లీను, క్లౌదియ, ఇక్కడి విశ్వాసులైన సహోదరి సహోదరులందరు తమ వందనాలు నీకు తెలియజేస్తున్నారు.
22ప్రభువు నీ ఆత్మతో ఉండును గాక. దేవుని కృప నీకు తోడై ఉండును గాక ఆమేన్.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.