
2 తిమోతి పత్రిక 2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
తిమోతి పౌలు బోధనను నమ్మదగిన ప్రజలకు అప్పగించి సైనికుడు, క్రీడాకారుడు, రైతు ఏకాగ్రతతో కష్టాన్ని భరించాలి. అతను వాక్కును ఖచ్చితంగా నిర్వహించి, వ్యర్థమైన వాదనలను నివారించి, సద్గుణాన్ని వెంబడించి, వ్యతిరేకులను సున్నితంగా సరిదిద్దాలి.
సహనంనమ్మదగిన బోధకులుఖచ్చితమైన బోధనసున్నిత సరిదిద్దడం
1నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు.
2అనేకమంది సాక్షుల సమక్షంలో నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగల నమ్మకమైన వారికి అప్పగించు.
3యేసు క్రీస్తు కోసం ఒక మంచి సైనికుని వలె నాతో పాటు కష్టాలను భరించు.
4యుద్ధానికి వెళ్లే ఏ సైనికుడైన తన సాధారణ జీవన వ్యాపార విషయాల్లో ఇరుక్కుపోడు కాని, తనపై అధికారిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు.
5అదే విధంగా ఒక క్రీడాకారుడు క్రీడానియమాల ప్రకారం పందెంలో పాల్గొంటేనే తప్ప విజయ కిరీటాన్ని పొందుకోలేడు.
6అలాగే పంటలోని భాగం మొదటిగా పొందాల్సింది కష్టపడి పని చేసే రైతే.
7నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించు, మన ప్రభువు నీకు అన్ని విషయాలను తెలుసుకోగల పరిజ్ఞానాన్ని దయచేస్తారు.
8మహారాజైన దావీదు సంతానంగా పుట్టిన యేసు క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచారని గుర్తుంచుకో. ఇదే నేను ప్రకటించిన సువార్త.
9దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు.
10కాబట్టి, దేవునిచే ఎన్నుకోబడినవారు కూడా నిత్యమహిమతో యేసు క్రీస్తులో ఉన్న రక్షణను పొందాలని నేను ఈ శ్రమలన్నింటిని సహిస్తున్నాను.
11ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతో పాటు చనిపోతే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము;
12మనం భరిస్తే, ఆయనతో పాటు మనం కూడా ఏలుతాము. మనం ఆయనను తిరస్కరిస్తే, ఆయన కూడా మనల్ని తిరస్కరిస్తారు;
13మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.
14దేవుని ప్రజలకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉండు. వినేవారిని నాశనం చేయడమే తప్ప ఏ విలువ లేని మాటల గురించి వాదించవద్దని దేవుని ఎదుట వారిని హెచ్చరించు.
15ఆమోదించబడినవానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్య వాక్యాన్ని సరిగా బోధించేవానిగా నిన్ను నీవు దేవునికి నిరూపించుకోవడానికి ప్రయాసపడు.
16దుష్టమైన కబుర్లకు దూరంగా ఉండు, ఎందుకంటే వాటిలో మునిగిపోయేవారు మరింత భక్తిహీనంగా మారతారు.
17వారి బోధలు కుళ్ళింపచేసే వ్యాధిలాంటివి. అలాంటివారిలో హుమెనేయు, ఫిలేతు అనేవారు ఉన్నారు.
18వారు సత్యానికి దూరమయ్యారు. పునరుత్థానం ముందే జరిగిపోయిందని చెప్తూ, కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.
19అయితే దేవుని యొక్క పునాది స్థిరంగా నిలిచి ఉండి, దానిపై ఈ విధంగా ముద్ర వేయబడి ఉంది: “తన వారు ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివారు దుష్టత్వం నుండి తొలగిపోవాలి.”
20ఒక పెద్ద ఇంట్లో బంగారు, వెండి పాత్రలే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉంటాయి; వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉపయోగపడితే, మరికొన్ని సాధారణమైన పనులకు వాడబడతాయి.
21అదే విధంగా, తమను తాము శుద్ధి చేసుకునేవారు ప్రత్యేకమైన పాత్రలుగా పరిశుద్ధపరచబడి, యజమానికి ఉపయోగకరంగా ఉండి, మంచి పని కోసం సిద్ధపరచబడిన పాత్రలుగా వాడబడతారు.
22యవ్వనకాల ఆశల నుండి పారిపో, కపటం లేని హృదయంతో ప్రభువును వేడుకొనువారితో పాటు నీతి, విశ్వాసం, ప్రేమ, శాంతిని అనుసరించు.
23మూర్ఖపు అవివేకమైన వాదనలను విసర్జించు, ఎందుకంటే అవి గొడవలను పుట్టిస్తాయని నీకు తెలుసు.
24ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు.
25దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.
26అప్పుడు వారు తమ తప్పును తెలుసుకుని, తన ఇష్టాన్ని చేయడానికి వారిని చెరలోనికి తీసుకెళ్లిన సాతాను ఉచ్చులో నుండి తప్పించుకోగలరు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.