
2 సమూయేలు 9
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
యోనాతానును గుర్తుచేసుకుంటూ, దావీదు సౌలు బతికి ఉన్న కుటుంబం కోసం వెతికి మెఫీబోషెతు భూమిని పునరుద్ధరిస్తాడు. అంగవైకల్యం, భయం ఉన్నప్పటికీ, యోనాతాను కుమారుడు స్థిరమైన ఒడంబడిక దయ ద్వారా రాజు బల్ల వద్ద శాశ్వత స్వాగతాన్ని, సదుపాయాన్ని పొందుతాడు.
దయఒడంబడిక విశ్వసనీయతపునరుద్ధరణఅనుబంధం
1ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.
2సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. వారు అతన్ని పిలిపించి దావీదు ఎదుట నిలబెట్టినప్పుడు రాజు అతన్ని, “నీవు సీబావా?” అని అడిగాడు. అందుకు వాడు, “అవును, రాజా” అన్నాడు.
3అప్పుడు రాజు, “దేవుడు నాకు దయచూపించినట్లుగా నేను దయచూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు; అతని రెండు కాళ్లు కుంటివి” అని చెప్పాడు.
4“అతడెక్కడ ఉన్నాడు?” అని రాజు అడిగాడు. అందుకు సీబా, “అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు.
5అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపించి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాడు.
6సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి అతని ఎదుట తల నేలకు వంచి నమస్కరించాడు. దావీదు, “మెఫీబోషెతూ!” అని పిలిచాడు. అతడు, “నేను నీ సేవకుడిని” అని సమాధానం ఇచ్చాడు.
7దావీదు అతనితో, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.
8అప్పుడు మెఫీబోషెతు నమస్కారం చేసి, “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నీవు దయ చూపడానికి నీ సేవకుడనైన నేను ఎంతటివాన్ని?” అన్నాడు.
9అప్పుడు రాజైన దావీదు సౌలు సహాయకుడైన సీబాను పిలిపించి, “సౌలుకు అతని కుటుంబానికి చెందిన సమస్తాన్ని నీ యజమాని మనుమడికి ఇప్పించాను.
10నీవు, నీ కుమారులు నీ పనివారు అతని కోసం ఆ భూమిని సాగుచేసి నీ యాజమాని మనుమడికి కావలసిన ఆహారాన్ని ఆ పంట నుండి తీసుకురావాలి. కాని నీ యాజమాని మనుమడైన మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. (సీబాకు పదిహేను మంది కుమారులు, ఇరవైమంది పనివారున్నారు.)
11అప్పుడు సీబా, “నా ప్రభువైన రాజు తన సేవకుడనైన నాకు చేయమని ఆజ్ఞాపించిన దాన్నంతా చేస్తాను” అన్నాడు. అప్పటినుండి మెఫీబోషెతు ఒక రాకుమారునిలా రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు.
12మెఫీబోషెతుకు చిన్నకుమారుడు ఉన్నాడు. అతని పేరు మీకా. సీబా ఇంట్లో ఉన్నవారందరు మెఫీబోషెతుకు సేవకులు.
13మెఫీబోషెతు యెరూషలేములో నివసించి నిత్యం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్లు కుంటివి.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.