
2 సమూయేలు 5
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
మొత్తం ఇశ్రాయేలు దావీదును మేయ్యగలవాడు, పాలకుడిగా గుర్తించి హెబ్రోనులో రాజుగా అభిషేకిస్తుంది. అతను యెరూషలేమును పట్టుకుని, దావీదు నగరాన్ని స్థాపించి, దైవిక నిర్దేశాన్ని కోరి అనుసరించడం ద్వారా పదే పదే వచ్చే ఫిలిష్తీయ దాడులను ఓడిస్తాడు.
ఐక్యతరాజరికంయెరూషలేముమార్గదర్శకత్వం
1ఇశ్రాయేలు గోత్రాలన్నీ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి, “మేము నీ రక్తసంబంధులము.
2గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు సైన్యాన్ని నీవే నడిపించావు. యెహోవా నీతో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు, వారిని పరిపాలిస్తావు’ అని చెప్పారు” అని అన్నారు.
3ఇశ్రాయేలు పెద్దలందరు హెబ్రోనులో ఉన్న రాజైన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, రాజు హెబ్రోనులో యెహోవా ఎదుట వారితో ఒక ఒడంబడిక చేశాడు; వారు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.
4దావీదు ముప్పై సంవత్సరాల వయస్సులో రాజై నలభై సంవత్సరాలు పరిపాలించాడు.
5హెబ్రోనులో యూదా వారిని ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించగా యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా వారిని ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
6యెబూసీయుల మీద దాడి చేయడానికి రాజు, అతని మనుష్యులు యెరూషలేముకు వెళ్లారు. దావీదు లోపలికి రాలేడని భావించిన యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు; ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తరిమివేస్తారు” అన్నారు.
7అయినా దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానిని దావీదు పట్టణం అంటారు.
8ఆ రోజే దావీదు, “యెబూసీయుల మీద దాడి చేయాలనుకునేవారు నీటి సొరంగం గుండా వెళ్లి దావీదు శత్రువులైన గ్రుడ్డివారిని కుంటివారిని చంపాలి” అన్నాడు. ఆ కారణంగానే, “గ్రుడ్డివారు కుంటివారు రాజభవనం లోపలికి రాలేరు” అనే సామెత పుట్టింది.
9దావీదు కోటలో నివాసం ఏర్పరచుకున్నాడు, దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. అతడు మిద్దె నుండి ఆ స్థలం లోపల కోట కట్టించాడు.
10సైన్యాల యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు.
11తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను, వారితో పాటు దేవదారు దుంగలను, వడ్రంగివారిని, రాళ్లతో పనిచేసే మేస్త్రీలను పంపాడు. వారు దావీదుకు రాజభవనం నిర్మించారు.
12ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచారని, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని గొప్ప చేశారని దావీదు గ్రహించాడు.
13హెబ్రోను నుండి వచ్చిన తర్వాత దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా ఉపపత్నులుగా చేసుకున్న తర్వాత ఇంకా చాలామంది కుమారులు కుమార్తెలు పుట్టారు.
14యెరూషలేములో అతనికి పుట్టిన పిల్లల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
15ఇభారు, ఎలీషువ, నెఫెగు, యాఫీయ,
16ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు.
17ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని సురక్షిత స్థలానికి వెళ్లాడు.
18ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయను విస్తరించారు.
19అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని యెహోవాను అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.
20కాబట్టి దావీదు బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట ఉండకుండా నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టాడు.
21ఫిలిష్తీయులు తమ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని మనుష్యులు వాటిని పట్టుకెళ్లారు.
22మరోసారి ఫిలిష్తీయులు లేచి రెఫాయీము లోయలో గుమికూడారు.
23కాబట్టి దావీదు యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు యెహోవా, “నీవు తిన్నగా వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి వారి వెనుక నుండి కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి.
24కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే వేగంగా కదులు ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి యెహోవా నీకు ముందుగా వెళ్లారని దాని అర్థం” అని అతనికి జవాబిచ్చారు.
25కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, అతడు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముతూ వారిని హతం చేశాడు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.