
2 రాజులు 20
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
అధ్యాయ సారాంశం
ప్రాణాంతక అనారోగ్యం సమయంలో హిజ్కియా ఏడ్చి ప్రార్థిస్తాడు, తిరోగమిస్తున్న నీడ ధృవీకరించిన స్వస్థత, పదిహేను అదనపు సంవత్సరాలను పొందుతాడు. తరువాత అతను గర్వంగా తన సంపదను బబులోను దూతలకు ప్రదర్శించి ప్రవాస హెచ్చరికను ఆహ్వానిస్తాడు.
స్వస్థతప్రార్థనగర్వంహెచ్చరిక
1ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.
2హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు,
3“యెహోవా, నేను నమ్మకంగా, యథార్థ హృదయంతో మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.
4యెషయా మధ్య ప్రాంగణం విడిచి వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి వచ్చింది:
5“నీవు వెనుకకు తిరిగివెళ్లి నా ప్రజల అధిపతియైన హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను; నేను నిన్ను స్వస్థపరుస్తాను. మూడవ రోజున నీవు యెహోవా ఆలయానికి వెళ్తావు.
6నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని, అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడతాను.’ ”
7తర్వాత యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేయండి” అని చెప్పగా వారు దానిని తెచ్చి ఆ పుండుకు రాసారు. హిజ్కియా కోలుకున్నాడు.
8హిజ్కియా యెషయాను, “యెహోవా నన్ను బాగు చేస్తారని, మూడవ రోజు నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.
9అందుకు యెషయా, “యెహోవా చెప్పిన మాట నెరవేరుస్తారని ఆయన నీకు ఇచ్చిన సూచన ఇదే: గడియారం మీద నీడ పది అంకెలు ఇప్పుడు ముందుకు వెళ్లాలా లేదా వెనుకకు వెళ్లాలా?” అన్నాడు.
10హిజ్కియా, “నీడ పది అంకెలు ముందుకు వెళ్లడం సులభమే. కాబట్టి నీడ పది అంకెలు వెనుకకు వెళ్లునట్లు చేయండి” అన్నాడు.
11అప్పుడు యెషయా ప్రవక్త యెహోవాకు ప్రార్ధించాడు. ఆహాజు చేయించిన గడియారపు పలక మీద నీడ పది అంకెలు వెనుకకు పోయేటట్టు యెహోవా చేశారు.
12ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోనుకు రాజును అయిన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసిందని విని ఉత్తరాలు, కానుక అతనికి పంపాడు.
13హిజ్కియా రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు.
14తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు.
15“నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ మరుగు చేయక అన్నీ వారికి చూపించాను” అన్నాడు.
16అప్పుడు యెషయా హిజ్కియాతో, “యెహోవా వాక్కు విను:
17ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు.
18నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.”
19హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి కదా” అని అనుకున్నాడు.
20హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు సాధించినవన్నీ, అతడు కొలను త్రవ్వించి, కాలువ కట్టించి, నీటిని పట్టణానికి సరఫరా చేసిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
21హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం — CC BY-SA 4.0. Where these translations come from.
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Available free at biblica.com and open.bible. Text unchanged, used under CC BY-SA 4.0.